శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2015 (18:25 IST)

ఛాలెంజర్స్ Vs రాయల్స్: ర్యాంకింగ్స్‌లో చెన్నై టాప్!

ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా బుధవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు తలపడనుంది. బెంగళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. రాజస్థాన్‌ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఐదు గెలిచింది. బెంగళూరు ఆరు మ్యాచ్‌లో మూడు గెలిచింది.
 
మరోవైపు మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ మ్యాజిక్ చేసింది. ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ చూస్తే, పరాజయం తప్పదనుకున్నారంతా. అయితే చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంత్రం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఓడిపోతుందనుకున్న చెన్నై విజయం సాధిస్తే, గెలుస్తుందనుకున్న కోల్ కతా బోల్తా పడింది. ఐపీఎల్-8 లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. 
 
టాస్ గెలిచిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్ల నుంచి చివరి దాకా తడబడిన చెన్నై బ్యాటింగ్ ఒకానొక దశలో వంద పరుగులు కూడా చేయలేదేమోనన్న అనుమానం కలిగింది. ఆ తర్వాత సులువైన టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 132 పరుగులే చేయగలిగింది. 
 
కెప్టెన్ గౌతం గంభీర్ డకౌట్ కాగా, 16 వ ఓవర్ తర్వాత వరుసగా మూడు డకౌట్లతో మొత్తం ఐదు వికెట్లను చెన్నై బౌలర్లు కూల్చారు. ఓపెనర్ రాబిన్ ఊతప్ప (39) శుభారంభాన్నే ఇచ్చినా, దానిని మిగిలిన బ్యాట్స్ మన్ కొనసాగించలేకపోయారు. దీంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ధోనీ సేన రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.