మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 జూన్ 2020 (13:11 IST)

గోపీచంద్ కారణంగానే నా కెరీర్ నాశనమైంది : గుత్తా జ్వాలా

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా మరోమారు వార్తలకెక్కారు. జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ పుల్లెల గోపీచంద్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు. తన కెరీర్‌ను గోపీచంద్ నాశనం చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 
 
ఆమె సోమవారం ఓ మీడియాతో మాట్లాడుతూ, 'నా కెరీర్‌లో ఎదుర్కొన్న వేధింపులకు గోపీచందే కారణంగా చెబుతాను. నేనేదైనా బహిరంగంగానే మాట్లాడతా. దీనికి తగిన మూల్యం కూడా చెల్లించా. బ్యాడ్మింటన్‌లో నా సత్తా ఏమిటో ఆయనకు తెలుసు. అందుకే నాకు మద్దతుగా ఉంటాడని భావించా. కానీ మిక్స్‌డ్‌లో నాతో కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో ఆడేవాడు. 
 
ఒకప్పుడు టాప్‌ ఆటగాళ్లు మన రాష్ట్రం నుంచి వచ్చేవారు కాదు. కానీ గత దశాబ్దకాలంగా అంతా హైదరాబాద్‌లోని అతడి అకాడమీ నుంచి మాత్రమే వస్తున్నారు. అలా అయితేనే వారికి గుర్తింపు లభిస్తుంది. భారత్‌కు పతకం వస్తే అది గోపీచంద్‌ శిక్షణ వల్లే వచ్చినట్టు, రాకపోతే మాత్రం తప్పు వ్యవస్థ మీదికి నెట్టేస్తున్నారు' అన గుత్తా జ్వాలా ఆరోపణలు చేసింది. 
 
కాగా, 2004లో గుత్తాజ్వాల, గోపీచంద్ ఇద్దరూ కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో జాతీయ ఛాంపియన్ షిప్ సాధించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది.