లాహోర్‌లో మంచు కురవొచ్చు.. కానీ ఇప్పట్లో అది సాధ్యం కాదు.. గవాస్కర్
ఇండోపాక్ క్రికెట్ ద్వైపాక్షిక సిరీస్ నిర్వహణపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య నెలకొనివున్న పరిస్థితుల దృష్ట్యా ఇరు దేశాల మధ్య ముఖాముఖి క్రికెట్ సిరీస్‌ల నిర్వహణ అసాధ్యమని ప్రకటించారు.
ఈ మేరకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీర్ రాజాకు చెందిన యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ స్పందిస్తూ, భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే అవకాశాల్లేవని స్పష్టం చేశారు.
ఒక్క మాటలో స్పష్టంగా చెప్పాలంటే, లాహోర్ నగరంలో మంచు కురవొచ్చేమో కానీ భారత్, పాక్ జట్ల మధ్య క్రికెట్ మాత్రం కష్టమేనని అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్ టోర్నీలు, ఇతర ఐసీసీ ఈవెంట్లలో రెండు జట్లు ఆడడం కొనసాగించాలని, కానీ ఓ సిరీస్‌లో తలపడడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని తేల్చిచెప్పారు.
కాగా, ఇటీవల రావల్పిండి ఎక్స్‌ప్రెస్, మాజీ ఫాస్ట్ బౌలర్ అయిన షోయబ్ అక్తర్ కూడా భారత్ - పాకిస్థాన్ క్రికెట్ దేశాల మధ్య దుబాయ్ వంటి తటస్థ వేదికలపై క్రికెట్ సిరీస్‌లు నిర్వహించి, వాటిద్వారా వచ్చే నిధులను కరోనా మహమ్మారిపై సాగుతున్న పోరాటానికి ఇరు దేశాల్లో ఖర్చు చేయాలని అభిప్రాయపడిన విషయం తెల్సిందే. దీనికి భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ కౌంటరిచ్చాడు.