ఈ ధోనీ మామూలోడు కాదు.... మరో రికార్డుపై కన్నేశాడు..(Video)
జార్ఖండ్ డైనమెట్.. మహేంద్ర సింగ్ ధోనీ. టీమిండియాలోకి అడుగుపెట్టాక తన అసమాన ప్రతిభతో రాణిస్తున్నాడు. భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించి తొలుత ట్వంటీ20, వన్డే ప్రపంచ కప్ టోర్నీల్లో జట్టును విశ్వవిజేతగా నిలిపారు. అలాంటి ధోనీకి దూకుడెక్కువ. కానీ, మైదానంలో మాత్రం ప్రశాంతంగా కనిపిస్తాడు. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పోయిస్తాడు. అలాంటి ధోనీ ఇప్పటికే అనేక రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. ఇపుడు మరో రికార్డుపై కన్నేశాడు.
దశాబ్దన్నరకుపైగా భారత్ తరపున వన్డేలు, టీ20లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీ.. పరిమిత ఓవర్ల క్రికెట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ధోనీనే వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ధోనీ ఇప్పటివరకు 594 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. మరో మూడు మ్యాచులు ఆడితే ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వికెట్ కీపర్‌గా మహీ అరుదైన ఘనత అందుకుంటాడు.
ఈ నేపథ్యంలో ఈనెల 24వ తేదీ నుంచి సొంతగడ్డపై భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగనుంది. మొత్తం ఐదు వన్డే మ్యాచ్‌లతో పాటు.. రెండు ట్వంటీ20 మ్యాచ్‌లను ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నింటిలో భారత జట్టు తరపున ప్రాతినిథ్యం వహిస్తే అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వికెట్ కీపర్ల జాబితో ధోనీ నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహిస్తాడు.
ఇప్పటివరకు ఈ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ 596 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతని తర్వాత ధోనీ (594) తర్వాతి స్థానంలో ఉన్నాడు. శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కర 499 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉండగా.. 485 మ్యాచ్‌లతో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. సో, సొంత గడ్డపై జరిగే వన్డే, ట్వంటీ20 సిరీస్‌ల్లో ధోనీ ఆడితో ప్రపంచ రికార్డు తన పేరిట లిఖించుకోనున్నాడు.