శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (12:21 IST)

ఆస్ట్రేలియాపై అతి కష్టంపై గెలిచిన న్యూజిలాండ్!

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన కీలక లీగ్ మ్యాచ్‌లో ఈ టోర్నీకి అతిథ్యమిస్తున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడగా, కంగారులపై కివీస్ ఆటగాళ్లు అతికష్టంపై గెలుపొందారు. తొలుత ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించగా, న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా రాణించి ఆ జట్టు వెన్ను విరిచి కేవలం 151 పరుగులకే పరిమితం చేశారు. ఆ తర్వాత తక్కువ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి 23.1 ఓవర్లలో లక్ష్యాన్ని అధిగమించింది. 
 
న్యూజిలాండ్ జట్టులో గుప్తిల్ 11, మెక్ కల్లమ్ 50, టేలర్ 1, ఇలియట్ 0, విలియమ్సన్ 45 (నాటౌట్), అండర్సన్ 26, రోన్చ్ 6, వెటోరి 2, మిల్నే 0, సౌథీ 0 చొప్పున పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 6 వికెట్లు తీయగా, కుమిన్స్, మాక్స్ వెల్ చెరో వికెట్ పడగొట్టారు. 5 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించిన న్యూజిలాండ్ బౌలర్ బౌల్ట్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
 
అంతకుముందు ఆస్ట్రేలియా జట్టులో ఒక్క ఆటగాడు కూడా రాణించలేదు. హడిన్ చేసిన 43 పరుగులే అత్యధికం. ఆస్ట్రేలియా స్కోర్‌లో ఫించ్ 14, వార్నర్ 34, వాట్సన్ 23, క్లార్క్ 12, స్మిత్ 4, మాక్స్ వెల్ 1, మార్ష్ 0, జాన్సన్ 1, స్టార్క్ 0, కుమిన్స్ 7 పరుగులకు అవుట్ అయ్యారు. 106 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 9వ వికెట్ కోల్పోగా అక్కడి నుంచి న్యూజిలాండ్ సహనానికి కొంత పరీక్ష ఎదురైంది. బ్రాడ్ హడిన్, కుమిన్స్ పరీక్ష పెట్టారు. జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ ను 150 పరుగులు దాటించారు. కివీస్ బౌలర్లలో బోల్ట్ ఐదు వికెట్లు తీసి కంగారుల వెన్నువిరవగా... సౌథీ, వెట్టోరిలు చెరో రెండేసి వికెట్లు తీశారు.