భారత్‌ను చూసి నేర్చుకోండి.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఇమ్రాన్ సలహా
పాకిస్థాన్ ప్రధానమంత్రి, ఆ దేశ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఓ ఉచిత సలహా ఇచ్చారు. భారత క్రికెట్ జట్టును చూసి నేర్చుకోవాలని ఆయన కోరారు. పైగా, టీమిండియాపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.
"భారత్‌ను చూడండి. ప్రపంచ అగ్రశేణి జట్టుగా రూపాంతరం చెందుతోంది. దీనికి కారణం వారికి దేశవాళీ క్రికెట్లో పటిష్ఠమైన పునాదులు ఉండడమే. దేశవాళీ క్రికెట్‌లో మా దేశం ఇప్పుడిప్పుడే బలపడుతోంది. ఆ ఫలితాలు రెండు, మూడేళ్లలో చూస్తాం. భవిష్యత్‌లో మా జట్టు ప్రపంచ విజేతగా అవతరిస్తుంది" అని ఇమ్రాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా, భారత జట్టు ప్రణాళిక, క్రికెట్‌లో సాధిస్తోన్న విజయాల గురించి ఆయన ప్రస్తావిస్తూ తమ జట్టుకు కూడా పలు సూచనలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ను చూస్తే ప్రపంచంలోనే గొప్ప జట్టుగా ఎదుగుతోందని, సరైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగుతోందని చెప్పారు.