పెట్రోల్ పోసి నడపడానికి క్రికెటర్లు యంత్రాలు కాదు : రవిశాస్త్రి
క్రికెటర్లు కూడా మనుషులేనన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ముఖ్యంగా, క్రికెటర్లు కూడా మనుషులేనని, పెట్రోల్ పోసి నడపడానికి వారేమీ యంత్రాలు కాదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, సోమవారం రాత్రి భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో నమీబియాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో రవిశాస్త్ర మాట్లాడుతూ, ఈ టోర్నీలో టీమిండియా పరిస్థితికి బీసీసీఐ, ఐసీసీనే కారణమని ఆరోపించారు.
గుక్కతిప్పుకోలేనంత బిజీ షెడ్యూల్ ఏర్పాటు చేసి టీమిండియా ఓటములకు పరోక్షంగా కారణమయ్యాయని మండిపడ్డారు. గత 6 నెలలుగా టీమిండియా ఆటగాళ్లు బయోబబుల్‌లో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆటగాడు అయినా శారీరకంగా, మానసికంగా అలసిపోతారని వివరించారు.
వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీకి ముందు ఏ జట్టు అయినా తాజాగా ఉండాలని కోరుకుంటుందని, కానీ భారత ఆటగాళ్ల విషయంలో అలా జరగలేదని అన్నారు. ఆటగాళ్లకు ఏమాత్రం వ్యవధి ఇవ్వకుండా బీసీసీఐ, ఐసీసీ షెడ్యూల్ రూపొందించాయని విమర్శించారు. క్రికెటర్లు కూడా మానవమాత్రులేనన్న సంగతిని బోర్డులు, అభిమానులు గుర్తించాలని పేర్కొన్నారు.