గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2019 (15:54 IST)

కోచ్‌ల రేసులో ఆ ఆరుగురు... రవిశాస్త్రికే పట్టమా?

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రితో పాటు మొత్తం ఆరుగురు రేసులో ఉన్నారు. ప్రస్తుతం కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి కాంట్రాక్టు ఇప్పటికే ముగిసింది. కానీ, వెస్టిండీస్ పర్యటన కోసం పొడగించారు. దీంతో భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) కసరత్తు పూర్తిచేసింది. 
 
ఈ పోస్టు కోసం అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఆరుగురితో తుది జాబితాను సిద్ధం చేసింది. ఇందులో ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పాటు మైక్‌ హెసెన్‌ (న్యూజిలాండ్‌), టామ్‌ మూడీ (ఆస్ట్రేలియా), ఫిల్‌ సిమన్స్‌ (విండీస్‌), లాల్‌చంద్‌ రాజ్‌పుత్, రాబిన్‌సింగ్‌ (భారత్‌) ఉన్నారు.
 
త్వరలోనే వీరికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం కోహ్లి అండదండలున్న రవిశాస్త్రికే మళ్లీ కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా, టామ్‌ మూడీ, మైక్‌ హెస్సెన్‌ల నుంచి రవిశాస్త్రికి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
అలాకాకుండా కోహ్లీ మాటనే పరిగణలోకి తీసుకుంటే ప్రధాన కోచ్‌ పదవిలో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా రవిశాస్త్రి, సపోర్టింగ్‌ స్టాఫ్‌ల పదవీ కాలాన్ని 45 రోజులు పొడిగించిన సంగతి తెలిసిందే.