శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (11:28 IST)

ఐపీఎల్-8: బెంగళూరు రాయల్స్ రికార్డ్ విన్.. 99 పరుగులతో..!

ఐపీఎల్-8వ సీజన్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకోలేక పోతున్న బెంగళూరు రాయల్స్ చాలెంజర్స్ జట్టు ఆదివారం రాత్రి రికార్డు విజయాన్ని నమోదు చేసింది. తొలుత ఆ జట్టు బౌలర్లు సత్తా చాటితే, ఆ తర్వాత బ్యాట్స్ మెన్ జూలు విదిల్చారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. 
 
బెంగళూరు బౌలర్లు మైఖేల్ స్టార్క్, వరుణ్ ఆరోన్, డేవిడ్ వీస్‌లు బంతితో రాణించి ఢిల్లీ టాపార్డర్‌ను కుప్పకూల్చారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (27), కీపర్ కేదార్ జాదవ్ (33)లు మినహా ఢిల్లీ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. భారీ అంచనాలతో క్రీజులో అడుగుపెట్టిన యువరాజ్ సింగ్ (2) నిరాశపరిచాడు. ఈ క్రమంలో కేవలం 95 పరుగులు చేసిన ఢిల్లీ 18.2 ఓవర్లలోనే పెవిలియన్ చేరింది. 
 
ఆ తర్వాత 96 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు వికెట్ నష్టపోకుండానే టార్గెట్‌ను ఛేదించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన విండీస్ హిట్టర్ క్రిస్ గేల్ (62), కెప్టెన్ విరాట్ కోహ్లీ (35) చెలరేగారు. వచ్చీరావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడ్డ వీరిద్దరూ ఢిల్లీ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. దీంతో 10.3 ఓవర్లలోనే 99 పరుగులు రాబట్టిన బెంగళూరు, సునాయాసంగానే రికార్డు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.