రోహిత్ శర్మలో ఆ కసి మాత్రం ఇంకా తగ్గలేదు : దినేశ్ కార్తీక్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు వయసు మీదపడుతున్నప్పటికీ ఆయనలో కసి మాత్రం ఇంకా తగ్గలేదని మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మకు వయసు 38 యేళ్లు కావడంతో ఆయన క్రికెట్ కెరీర్ ముగింపు దశకు చేరుకుందనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలో వచ్చే 2027లో వన్డే ప్రపంచ కప్ జరుగనుంది. ఇందులో రోహిత్ శర్మ ఆడుతాడా లేదా అన్నది క్రికెట్ అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. దీనిపై దినేశ్ కార్తీక్ స్పందిస్తూ, వచ్చే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ పాత్ర అత్యంత కీలకమని, భారత జట్టుకు అతను చాలా అవసరమని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.
'2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత, వన్డే కప్ గెలవాలనే కసి రోహిత్ ఇంకా బలంగా ఉంది. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచి కెప్టెన్‌గా తన కలను నెరవేర్చుకున్నా, 50 ఓవర్ల కప్ గెలవాలనే కోరిక అతనిలో ఇప్పటికీ మండుతూనే ఉంది' అని కార్తీక్ అభిప్రాయపడ్డారు.
రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్‌ను కార్తీక్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. "2023 ప్రపంచకప్ తర్వాత రోహిత్ గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అతను 48 సగటుతో వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ గురించి మనందరికీ తెలిసిందే. రాబోయే 2027 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుంటే, బ్యాటర్‌గా రోహిత్ జట్టుకు చాలా ముఖ్యం. అతను పూర్తి మనసు పెట్టి ఆడితే, కచ్చితంగా ఆ టోర్నీలోనూ రాణిస్తాడనే నమ్మకం నాకుంది" అని డీకే పేర్కొన్నాడు.