శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 మే 2015 (16:28 IST)

రోహిత్ శర్మ మెరుగైన కెప్టెన్‌గా ఎదిగాడు: సచిన్ టెండూల్కర్

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలతో ముంచెత్తాడు. నాయకుడిగా రోహిత్ ఎదిగాడని కితాబిచ్చాడు. అతను ఇప్పుడెంతో మెరుగైన కెప్టెన్‌గా కనిపిస్తున్నాడని అభిప్రాయపడ్డాడు. ముంబై నాయకుడిగా ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసి, మరెన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రస్థానం సాగించాడని కొనియాడాడు. ఇలాంటి సవాళ్లే మంచి క్రికెటర్‌గానూ, దృఢమైన వ్యక్తి‌గానూ మలుస్తాయని తెలిపారు. 
 
తాము రూపొందించిన వ్యూహాలను రోహిత్ మైదానంలో అద్భుతంగా అమలుచేశాడని సచిన్ అభినందించారు. నాలుగ్గోడల మధ్య తాము చాలా ప్రణాళికలు రూపొందించినా, వాటిని విజయవంతం చేయాల్సింది కెప్టెనే అని, ఆ పనిని రోహిత్ అమోఘమైన రీతిలో నిర్వర్తించాడని వివరించారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్లో జట్టును ముందుండి నడిపించిన రోహిత్, అంతకుముందు వరుస పరాజయాలతో కుదేలైన జట్టును గెలుపుబాట పట్టించి, ఫైనల్ చేర్చిన సంగతి తెలిసిందే.