శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (13:12 IST)

ఐపీఎల్ మ్యాచ్‌లు తరలిస్తే కరువు పోతుందా.. : సునీల్ గవాస్కర్

మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను తరలిస్తే అక్కడ నెలకొన్న కరువు పోతుందా అని భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ప్రశ్నించారు. కరువుకు శాశ్వత పరిష్కారం కనుగొనాలేగానీ, ప్రతి రాజకీయ విషయానికి క్రికెట్‌కు ముడిపెట్టడం తగదని ఆయన హితవు పలికారు. 
 
మహారాష్ట్రలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ఆ రాష్ట్రంలో నిర్వహించాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లన్నింటినీ మరో ప్రాంతానికి తరలించాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. దీనిపై గవాస్కర్ స్పందిస్తూ.. 'క్రికెట్‌ అనేది తేలికైన లక్ష్యంగా మారిపోతోంది. రైతుల జీవితాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడించనంత మాత్రాన నీటి సమస్య తీరిపోతుందా? అలాగైతే అది ఎలాగో చూపించాలి అని కోరారు.
 
అంతేకాకుండా, తాము మంచి నీటిని వాడబోమని బీసీసీఐ చెప్పింది. ఫ్రాంఛైజీలు విరాళాలివ్వడానికి ముందుకొచ్చాయి. ఈ ఉద్దేశాలు మంచివే కదా. అసలు ఒక్క క్రికెట్‌ను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈత కోసం.. ఇళ్ల దగ్గర తోట పనికి వాడుతున్న నీళ్ల మాటేంటి? ఇవన్నీ అలాగే కొనసాగుతాయి. ఈ ఒక్క విషయంలోనే కాదు. ఏదైనా రాజకీయం తలెత్తినా క్రికెట్‌ మీదికి దృష్టి మళ్లుతుందన్నారు. 
 
ముఖ్యంగా.. దేశాల మధ్య సంబంధాల విషయంలోనూ క్రికెట్‌ మీద చర్చ నడుస్తుంది. నీటి సమస్య దీర్ఘకాలికం. గత రెండు మూడేళ్లుగా వర్షాలు తక్కువ పడుతున్నాయి. ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపించాలి. వర్షపాతం తగ్గినపుడు ఏం చేయాలో విధాన నిర్ణయాలుండాలి. ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఆపినంత మాత్రాన సరిపోదు అని అన్నారు.