గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఐపీఎల్ 2023 : పంజాబ్‌ కింగ్స్‌పై సన్ రైజర్స్ గెలుపు

rahul tripati
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 టోర్నీలో భాగంగా, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన హైదరాబాద్ జట్టు.. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం జూలు విదిల్చింది. ఫలితంగా 144 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 17.1 ఓవర్లలోనే ఛేదించింది. ఆ జట్టు ఆటగాడు త్రిపాఠి 48 బంతుల్లో 74 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. 
 
తొలి రెండు మ్యాచ్‌లలో చిత్తుగా ఓడిపోయిన హైదరాబాద్ జట్టు... పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌‍లోమాత్రం ఎనిమిది వికెట్ల తేడాతో ఘనంగా గెలిచింది. సన్ రైజర్స్ విజయంలో రాహుల్ త్రిపాఠి అర్థ సెంచరీతో ప్రధాన పాత్ర పోషించారు. వన్‌డౌన్‌లో వచ్చిన త్రిపాఠి పంజాబ్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. స్పిన్, పేస్ అనే తేడా లేకుండా బంతి కనిపిస్తే చాలు బాదేశాడు. ఫలితంగా త్రిపాఠి 48 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. త్రిపాఠికి కెప్టెన్ మార్కమ్ కూడా జత కలిశాడు. 
 
ఈ జోడీ మరో వికెట్ పడకుండా జట్టును గెలుపుతీరాలకు చేర్చింది. మార్కం 21 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ప్రత్యర్థి తన ముంగిట ఉంచిన 144 పరుగుల టార్గెట్‌ను హైదరాబాద్ జట్టు 17.1 ఓవర్లలో ముగించింది. ఈ క్రమంలో కేవలం 2 వికెట్లను కోల్పోయింది. 
 
తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమైన హ్యారీ బ్రూక్‌ను ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దించారు. కానీ, భారీ స్కోరు సాధించడంలో విఫలమయ్యారు. బ్రూక్ 13 పరుగులు చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో వెనువదిరిగారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 21 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్, రాహుల్ చాహర్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
అంతకుముందు పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావవ్ 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలించాడు. హైదరాబాద్ బౌలర్లలో మాయాంక్ మార్కండే ఒక్కరే నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు.