సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (12:04 IST)

సయ్యద్ కిర్మాణీ రికార్డును బద్ధలు కొట్టిన రిషబ్ పంత్!

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం సిడ్నీ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ క్ర‌మంలో టీమిండియా మాజీ వికెట్ కీప‌ర్ స‌య్య‌ద్ కిర్మాణీ పేరిట ఉన్న రికార్డును అధిగ‌మించాడు. ఇప్ప‌టివ‌ర‌కూ కిర్మానీ 471 ప‌రుగుల‌తో టాప్‌లో ఉన్నాడు. 
 
సాధారణంగా ఆస్ట్రేలియాలో టెస్ట్ క్రికెట్ అంటే టాప్ బ్యాట్స్‌మెన్‌కు కూడా ఓ స‌వాలే. అక్క‌డి బౌన్సీ పిచ్‌లు ముఖ్యంగా స‌బ్‌కాంటినెంట్ బ్యాట్స్‌మెన్‌కు వ‌ణుకు పుట్టిస్తాయి. కానీ టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ మాత్రం ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఆడ‌టాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. 
 
సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 97 ప‌రుగుల ఇన్నింగ్స్‌తో పంత్ ఓ అరుదైన రికార్డును త‌న సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆసియా వికెట్ కీప‌ర్‌గా నిలిచాడు. 
 
తాజాగా 97 ప‌రుగుల ఇన్నింగ్స్‌తో పంత్ అత‌న్ని మించిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ 36 ప‌రుగులు చేసిన పంత్‌.. మొత్తంగా 512 ప‌రుగుల‌తో టాప్‌లో ఉన్నాడు. అంతేకాదు ఆస్ట్రేలియాలో అత‌ని స‌గ‌టు 56.88గా ఉండ‌టం విశేషం. ఇక టెస్ట్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో ఎక్కువ ప‌రుగులు చేసిన జాబితాలో తొలి రెండు స్కోర్లు కూడా పంత్‌వే. 
 
గ‌తంలో 2018లో ఇంగ్లండ్‌లో 114 ప‌రుగులు చేసిన పంత్‌.. తాజాగా ఆసీస్‌పై 97 ప‌రుగులు చేశాడు. అత‌ని త‌ర్వాత ఇంగ్లండ్‌పై 2007లో ధోనీ చేసిన 76 ప‌రుగులు, 2016లో ఇంగ్లండ్‌పై పార్థివ్ ప‌టేల్ చేసిన 67 ప‌రుగులు ఉన్నాయి. 
 
ఇదే టెస్ట్‌తో పంత్ మ‌రో రికార్డునూ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇది అత‌నికి మాత్ర‌మే సాధ్య‌మైన అరుదైన రికార్డు. ఆస్ట్రేలియాలో 9 వ‌రుస టెస్టు ఇన్నింగ్స్‌లో 25, అంత‌కంటే ఎక్కువ స్కోర్లు చేసిన ఏకైక బ్యాట్స్‌మ‌న్‌గా పంత్ నిలిచాడు. 
 
నిజానికి తొలి ఇన్నింగ్స్‌లో 36 ప‌రుగుల ఇన్నింగ్స్‌తోనే పంత్ ఈ రికార్డు అందుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మ‌న్ వాలీ హామండ్‌ను అత‌ను అధిగ‌మించాడు. ఆస్ట్రేలియాలో చివ‌రి ప‌ది టెస్ట్ ఇన్నింగ్స్‌లో పంత్ వ‌రుస‌గా 25, 28, 36, 30, 39, 33, 159, 29, 36, 97 ప‌రుగులు చేయ‌డం విశేషం.