జస్ప్రీత్ బుమ్రా స్థానంలో షమీ? క్లారిటీ ఇచ్చిన రాహుల్ ద్రావిడ్
ఈ నెల 16వ తేదీ నుంచి ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరుగనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ప్రారంభానికి భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇది అభిమానుల్లో కలకలం రేపుతోంది.
పైగా, స్వదేశంలో పర్యాటక దక్షిణాఫ్రికాతో చరిగిన చివరి టీ20 మ్యాచలో భారత జట్టు పేలవ ప్రదర్శనతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో జట్టులో బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి విషయం తెరపైకి వచ్చింది. బీసీసీఐ ఇంకా దీనిపై స్పష్టతనివ్వలేదు. ఈ నేపథ్యంలో పేసర్ మహమ్మద్ షమీని అతడి స్థానంలో ఆడిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
వీటిపై జాతీయ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించారు. 'బుమ్రా స్థానంలో ఎవరుంటారనే అంశాన్ని పరిశీలించాల్సి ఉంది. మాకింకా అక్టోబర్ 15 వరకు సమయం ఉంది. స్టాండ్‌బై ఆటగాళ్లలో షమీ ఒకడైనప్పటికీ అతడు ఈ సిరీస్‌లో ఆడలేకపోవచ్చు. 14- 15 రోజుల పాటు కొవిడ్‌తో పోరాడిన అతడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుంది.
అది ఎన్సీఏ ధ్రువీకరించిన తర్వాతే మేమైనా, సెలెక్టర్లైనా ఓ నిర్ణయానికి రాగలం. ఎవరు ఆడినా తన ఆటను ఆస్వాదిస్తూ జట్టుకు మేలు చేయగలిగితే చాలు. ఒక ఆటగాడి నుంచి మేం కోరుకునేది అదొక్కటే' అంటూ మంగళవారం మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో ద్రవిడ్ వివరించాడు.