శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 జులై 2021 (12:08 IST)

స్మృతి మంధాన దుమ్మురేపింది.. 39 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లు

ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న హండ్రెడ్‌ బాల్‌ వుమెన్‌ కాంపిటీషన్‌ టోర్నీలో భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన దుమ్మురేపింది. సదరన్ బ్రేవ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మంధాన 39 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులతో నాటౌట్‌గా నిలవడమేగాక ఒంటిచేత్తో జట్టును గెలిపించింది. 
 
మంధాన మెరుపులతో మరో 16 బంతులు మిగిలి ఉండగానే సదరన్‌ బ్రేవ్‌ విజయాన్ని అందుకుంది. మంధాన బ్యాటింగ్‌ విషయాన్ని పరిశీలిస్తే.. మొదటి 25 బంతులకు 29 పరుగులు చేసిన స్మృతి ఆ తరువాతి 14 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 32 పరుగులు చేసింది. 
 
మంధాన బ్యాటింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన వెల్ష్‌ ఫైర్‌ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. వెల్ష్‌ ఫైర్‌ బ్యాటింగ్‌లో హెలీ మాథ్యూస్‌ 33 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. జార్జియా హెనెస్సీ 23 నాటౌట్‌గా నిలిచింది. 
 
సదరన్‌ బౌలింగ్‌లో లారెన్‌ బెల్‌, వెల్లింగ్‌టన్‌ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సదరన్‌ బ్రేవ్‌ వుమెన్‌ 84 బంతుల్లోనే లక్ష్యాన్ని చేరుకుంది. స్మృతి 61 నాటౌట్‌, స్టఫానీ టేలర్‌ 17 నాటౌట్‌గా నిలిచారు.