సోమవారం, 10 మార్చి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 మార్చి 2025 (17:52 IST)

ఫామ్ కోల్పోయిన హిట్ మ్యాన్ : రిటైర్ అవుతారా? లేదా?

rohith sharma
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా ఫామ్‌లో లేరు. తన స్థాయికి తగిన రీతిలో ఆటతీరును కనబర్చలేకపోతున్నారు. నిలకడలేమితో కొన్నిసార్లు జట్టుకు భారంగా మారుతున్నారు. ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ టోర్నీలో కూడా రోహిత్ శర్మ కెప్టెన్ అయినప్పటికీ చివరి టెస్టులో కుంటి సాకులు చెప్పి పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది రోహిత్‌తో పాటు జట్టు మేనేజ్‌మెంట్‌కు చాలా ఇబ్బందికరంగా మారింది. 
 
దీంతో ఈ టోర్నీ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ కీలక ప్రకటన చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన వైపు ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చిన చాంపియన్స్ ట్రోఫీలో కూడా రోహిత్ శర్మ పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ తర్వాత తన కెరీర్‌ కొనసాగింపుపై రోహిత్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు బీసీసీఐ వర్గాల సమాచారం. ఒకవేళ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తే అతడిని వారసుడుని గాలించే పనిలో బీసీసీఐ అధికారులు నిమగ్నమయ్యారు.
 
కాగా, ఆస్ట్రేలియా లెజెండ్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, బంగ్లాదేశ్ సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ముష్పికర్ రహీమ్‌లు తమ వన్డే క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పారు. అలాగే, ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ కూడా కెప్టెన్సీని త్యజించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటాడేమోనని బీసీసీఐ వర్గాలు ఎదురు చూస్తోంది.