గౌహతి స్టేడియంలో అనుకోని అతిథి
గౌహతి వేదికగా ఆదివారం రాత్రి భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో అనూహ్య ఓ దృశ్యం కెమెరా కంటికి కనిపించింది. భారత ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్ పూర్తయి ఎనిమిదో ఓవర్ మొదలు కాబోతున్న సమయంలో ఓ పాము జరజరా పాకుతూ స్టేడియంలోకి వచ్చేసింది.
దీంతో ఆటను ఆపేసి క్రికెటర్లలంతా ఆ పాము వైపే చూస్తుండిపోయారు. అభిమానులకు కూడా ఏం జరిగిందో వెంటనే అర్థం కాలేదు. మైదానంలోకి హుటాహుటిన పరుగు పెట్టిన సిబ్బంది పామును పట్టి బయటకు తీసుకెళ్లిపోయారు. మైదానంలోకి కుక్కలు రావడం సాధారణమే కానీ.. ఇలా పాము రావడం అనూహ్యం. దీంతో కాసేపు కెమెరాలన్ని దాని చుట్టూనే తిరిగాయి.
ఇదొక్కటే కాదు మ్యాచ్‌లో నిర్వాహణ లోపాలు స్పష్టంగా కనిపించాయి. దక్షిణాఫ్రికా ఛేదనలో దీపక్ చాహర్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతి వేసిన తర్వాత స్టేడియంలోని నాలుగు ఫ్లడ్ లైట్లలో ఒక ఫ్లడ్‌లైట్ ఆగిపోయింది. దీంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. ఆటకు 18 నిమిషాలు అంతరాయం కలిగింది. ఏది ఏమైనా ఈ మ్యాచ్‌లో భారత్ 13 పరుగుల తేడాతో గెలుపొందింది.