బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (18:28 IST)

ప్రపంచంలోనే అత్యంత ధనవంత క్రికెటర్ ఎవరు?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. క్రికెట్‌లోని ఏ ఫార్మెట్‌లోనైనా పరుగుల వరద పారిస్తున్న క్రికెటర్. బ్యాట్‌తో అద్భుతాలు సృష్టిస్తూ టీమిండియాకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తున్న ఢిల్లీ క్రికెటర్. అలా మైదానంలో తన బ్యాట్‌తో మాయాజాలం సృష్టిస్తూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాడు. అంతేకాదండోయ్... మైదానం వెలుపల కూడా తన సత్తా చాటుతున్నారు. తనకు మించిన క్రికెటర్ లేడంటూ నిరూపిస్తున్నాడు. తాజాగా తన బ్రాండ్‌ విలువతో ఆధిపత్యం ప్రదర్శించాడు.
 
ఈ యేడాది ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన క్రికెటర్‌గా కోహ్లీ అవతరించాడు. ఫోర్బ్స్ ఈ యేడాది ప్రకటించిన జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. ఈ యేడాది కోహ్లీ నికర విలువ 174 కోట్ల రూపాయలని ఫోర్బ్స్ వెల్లడించింది. కోహ్లీ ప్రస్తుతం 23 బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. 
 
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆడీ వరకు చాలా సంస్థలకు కోహ్లీ ప్రచారకర్తగా ఉన్నాడు. ప్రస్తుతం బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లలో కోహ్లీ స్టార్‌గా ఎదిగాడు. అలాగే హోటల్ చైన్‌లో భాగస్వామిగా ఉన్నాడు. అలాగే జర్మన్ కంపెనీ పూమాతో వంద కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుని అందరిదృష్టిని ఆకర్షించాడు.