గురువారం, 24 ఏప్రియల్ 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (20:28 IST)

ఐపీఎల్ 2025 : పంజాబ్‌ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ గెలుపు

kohli
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పీబీకేఎస్ జట్టుపై బెంగుళూరు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ టోర్నీలో ఆర్సీబీకి ఇది ఐదో విజయం కావడం గమనార్హం. 
 
ఈ మ్యాచ్‌‍లో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ 54 బంతుల్లో ఏడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 73 (నాటౌట్), దేవదత్ పడిక్కల్ 35 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్స్‌ల సాయంతో 61 పరుగులు చేసి బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించడంతో గెలుపు సులభతరమైంది. 
 
పంజాబ్ జట్టు నిర్ధేశించిన 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి తిగిన బెంగుళూరు జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫిలిప్ సాల్ట్‌ను అర్షదీప్ సింగ్ ఆరంభంలోనే పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన దేవదత్... మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్డాడు. ముఖ్యంగా, పడిక్కల్ దూకుడుగా ఆడి పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. కోహ్లీ, పడిక్కల్ కలిసి రెండో వికెట్‌కు కీలకమైన 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 
 
పడిక్కల్ ఔటైన తర్వాత కెప్టెన్ రజత్ పాటిదార్ (12) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. అయితే, విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆఖరు వరకు క్రీజ్‌లో నిలిచి బాధ్యతాయుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. దీంతో ఆర్సీబీ 18.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీవ్ సింగ్, హరప్రీత్ బ్రార్, యజ్వేంద్ర చాహల్ తలో వికెట్ పడగొట్టారు.