బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (09:52 IST)

విరాట్ కోహ్లీ మరో కఠిన నిర్ణయం - ఆర్సీబీ సారథ్య బాధ్యతలకు గుడ్‌బై!

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో జరుగనున్న ట్వంటీ20 ప్రపంచ కప్ తర్వాత భారత టీ20 జట్టుకు కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించాడు. ఇపుడు మరో కీలక ప్రకటన చేశాడు. 
 
ఐపీఎల్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) కెప్టెన్‌గా కోహ్లీకి చివరి సీజన్ కానుంది. ఆపై ఆటగాడిగా జట్టులో కొనసాగనున్నాడు. ఈ మేరకు కోహ్లీ నిర్ణయాన్ని ఆర్సీబీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఒత్తిడిని తట్టుకోలేక సతమతం అవుతున్న కోహ్లీ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. 
 
ఐపీఎల్ 2021 సీజన్‌తో తన కెప్టెన్సీ ముగిస్తుందని వీడియో రూపంలో తెలిపాడు. గత తొమ్మిదేళ్లుగా ఆర్సీబీకి సారథ్యం వహిస్తున్నాను. అయితే ఆటగాడిగా, కెప్టెన్‌గా పూర్తి స్థాయిలో శక్తివంచన లేకుండా ప్రయత్నించాను. పని భారం పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాను. 
 
ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానని మేనేజ్‌మెంట్‌కు నేటి సాయంత్రం నా నిర్ణయాన్ని వెల్లడించాను. తనకు ఇన్నిరోజులు మద్దతు తెలిపిన అభిమానులు, మేనేజ్మెంట్, సహచర ఆటగాళ్లకు వీడియో ద్వారా ధన్యవాదాలు అంటూ కోహ్లీ పేర్కొన్నాడు. ఆర్సీబీ కెప్టెన్‌గా తన జర్నీని చాలా ఎంజాయ్ చేశానని, ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని కోహ్లీ స్పష్టం చేశాడు.