సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాాబాద్ , గురువారం, 3 ఆగస్టు 2017 (07:37 IST)

బైక్‌పై తిరగలేనంతగా గుర్తుపడుతున్నారు.. పెళ్లి మరో ఐదేళ్లు వాయిదా: మిథాలీ రాజ్

క్రికెటర్‌గా కెరీర్ ప్రారంభించి 18 ఏళ్లయింది. మహిళా క్రికెట్ కెప్టెన్‌గా పదేళ్లకుపైగా ఆడుతున్నప్పటికీ హైదరాబాద్‌లో కానీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కానీ ఆమెను పెద్దగా గుర్తుపట్టేవారు లేరు. సాధారణ పౌరురాలిగా కార్లు, బైకులమీద తిరుగుతూ తనకు ఇష్టమైన హోటళ్ల

క్రికెటర్‌గా కెరీర్ ప్రారంభించి 18 ఏళ్లయింది. మహిళా క్రికెట్ కెప్టెన్‌గా పదేళ్లకుపైగా ఆడుతున్నప్పటికీ హైదరాబాద్‌లో కానీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కానీ ఆమెను పెద్దగా గుర్తుపట్టేవారు లేరు. సాధారణ పౌరురాలిగా కార్లు, బైకులమీద తిరుగుతూ తనకు ఇష్టమైన హోటళ్లలో తింటూ సాధారణ జీవితం గడిపేదామె. కానీ లండన్‌లో మొన్న ప్రపంచ కప్‌ను త్రుటిలో చేజార్చుకున్న ఘటన తర్వాత ఆమె పేరు దేశంలో మార్మోగుతోంది. ఆమెకే కాదు టీమిండియా మహిళా క్రికెటర్లందరి దశ మారిపోయింది. భారత క్రికెట్లో మహిళా క్రికెటర్లలో స్టార్లు ఉద్భవిస్తున్న క్షణాలివి. ఇది కెప్టెన్‌గా ఆమె గర్విస్తున్న క్షణం. కానీ గత 18 ఏళ్లలో తొలిసారిగా హైదరాబాద్‌లో ఆమె స్వేచ్ఛకు అడ్డుకట్ట పడింది. అమ్మ శాసించింది. ఇంటికి రాగానే ‘నువ్వు టూవీలర్‌పై బయటకు వెళ్లొద్ద’ని  అమ్మ గట్టిగా చెప్పింది. సినిమాలు, షికార్లు చేయాలని ఉన్నా.. లక్ష్యం చేరుకునే క్రమంలో సరదాలకు ప్రాధాన్యతను ఇవ్వలేకపోయిన ఆమె ఎవరో కాదు టీమిండియా కేప్టెన్ మిథాలీరాజ్. 
 
అత్యంత సాధారణ కుటుంబంలో పుట్టి తమిళ మూలమే అయినప్పటికీ స్పష్టమైన తెలుగులో మాట్లాడుతూ తెలుగమ్మాయిలాగే వ్యవహరిస్తూ, సంతోషంలో డ్యాన్స్ చేస్తూ అంతలోనే సిగ్గుపడుతూ కెప్టెన్ అనే దర్పాన్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా సింపుల్‌గా మెలిగే మిథాలీ రాజ్ భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఇప్పుడొక మేలి ముత్యం. తండ్రి కోసం తొమ్మిదేళ్ల వయసులో క్రికెట్‌ను కెరీర్‌గా తీసుకుని జీవితంలో అన్ని సరదాలను, ఆనందాలను, స్నేహాలను మాత్రమే కాకుండా పెళ్లిని కూడా పక్కనపెట్టి 18 ఏళ్లపాటు కెరీర్‌కే అంకితమైపోయిన మిథాలీరాజ్ భారత మహిళలకే కాదు పురుషులకు కూడా చెరగని స్ఫూర్తి. 
 
ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచి ప్రధాని మోదీ ప్రశంసలను అందుకుని హైదరాబాద్  తిరిగొచ్చిన మిథాలీ తన అలవాట్లు, అబిరుచులు, సరదాలు, ఆహార విశేషాలు ఇలా వ్యక్తిగత విషయాలను, వృత్తి విశేషాలను మీడియాతో పంచుకుంటూ బిజీగా ఉంటోంది. క్రికెట్‌లో హైదరాబాద్‌ సిటీ పేరును శిఖరాగ్రాన నిలబెట్టిన మిథాలీ ఈ నగరం నాకెన్నో ఇచ్చింది అంటూ కృతజ్ఞత ప్రకటిస్తోంది.జాతీయ మీడియాతో తప్పనిసరిగా ఇంగ్లీషు, హిందీలోనే మాట్లాడవలసి వచ్చినా.. హైదరాబాద్‌లో అడుగు పెట్టిన తర్వాత అచ్చమైన తెలుగులో గలగలా మాట్లాడే మిథాలీనుంచి తాజా విషయాలు తెలుసుకుందాం.
 
ఇప్పటి వరకు అబ్బాయిలే గల్లీ క్రికెట్‌ ఆడటం చూశా. ఎప్పుడైనా రోడ్డుపై వెళ్తున్నప్పుడు అబ్బాయిల్లా అమ్మాయిలు కూడా అలా ఆడితే చూడాలని ఉంది. మొన్న జరిగిన ప్రపచంకప్‌ పోటీల్లో మా ఆట చూసిన వారంతా ఫిదా అయ్యారు. అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ఇదే చక్కని సమయం. ఫిట్‌నెస్‌ సరిగ్గా లేకపోతే క్రికెట్‌ ఆడలేం. అందుకే నా రోజువారీ సమయంలో ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. ఉదయం టిఫిన్‌ అయ్యాక జిమ్‌ చేస్తాను. ఇలా రోజులో రెండు సార్లు ఫిట్‌నెస్‌పై దృష్టి పెడతా. నాకు డ్రెస్సింగ్‌కు ప్రయార్టీ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కువగా క్రికెట్‌ డ్రెస్స్‌లోనే ఉంటాను. అయితే ఏం ధరించినా కంఫర్ట్‌గా ఉండాలి. ఎక్కువగా ఫ్రాక్‌ అంటే ఇష్టం. చుడిదార్, జీన్స్‌ కూడా వేసుకుంటా.
 
సినిమాలు చాలా తక్కువ చూస్తాను. నా ఫ్రెండ్స్‌లో ఎక్కువగా హిందీ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఎప్పుడైనా సమయం దొరికిందంటే వారితో కలసి సినిమా చూస్తాంటాను. బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్‌ నా ఫెవరేట్‌ హీరో. తెలుగు సినిమాలు చూడటం చాలా తక్కువ. ఫ్రెండ్స్‌ బలవంతం మీద ఐదేళ్ల తరువాత నేను చూసిన సినిమా బాహుబలి–2. ప్రపంచంలో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్, ఎంఎస్‌ ధోనీలపై ఇప్పటికే బయోగ్రఫీ సినిమాలు వచ్చాయి. చాలా బాగున్నాయి. నా బయోగ్రఫీపై సినిమా వస్తే బాగుంటుంది.
 
ప్రస్తుతం నా దృష్టి అంతా క్రికెట్‌పైనే. నెక్ట్స్‌ వరల్డ్‌కప్‌ ఆడాలనుకుంటున్నా. పెళ్లి చేసుకుంటే క్రికెట్‌పై దృష్టి సారించలేను. పెళ్లి రిటైర్‌ అయ్యాక ఆలోచిద్దామనుకుంటున్నా. నాకు కంఫర్టబుల్‌గా ఉంది, నన్ను గౌరవించే వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంటా. క్రికెట్‌ అకాడమీ ఏర్పాటు లాంటి విషయాలను ఇప్పటి వరకు ఏం ఆలోచించలేదు. ఐతే మహిళలు క్రికెట్‌ను కేరీర్‌ ఎంచుకుని ముందుకు రావాలి.  హైదరాబాద్‌ని ఎప్పటికీ ఇష్టపడతాను. స్కూల్, కాలేజ్‌ లైఫ్‌ అంతా సిటీలోనే కావడంతో ఫ్రెండ్స్‌తో కలసి బైక్‌పై తిరిగేదాన్ని. అప్పట్లో పెద్దగా ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల తర్వాత అభిమానం చాలా పెరిగింది. ప్రతి ఒక్కరూ మిథాలీని గుర్తిస్తున్నారు. ఇంటికి రాగానే ‘నువ్వు టూవీలర్‌పై బయటకు వెళ్లొద్ద’ని మా అమ్మ గట్టిగా చెప్పింది.
 
సినిమాలు సరదాలు తీర్చుకోవాలనుకున్నా కెరీర్ లక్ష్యం కారణంగా అన్నిటికీ దూరమైపోయానంటున్న మిథాలీకి మరిన్ని విజయాలు సాధించాలంటూ బెస్ట్ విషెస్ చెబుదాం.