గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2023 (14:17 IST)

ఇలాంటి పాకిస్థాన్ జట్టును మునుపెన్నడూ చూడలేదు : గంగూలీ

ganguly
స్వదేశంలో జరుగుతున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విమర్శలు గుప్పించారు. ఇలాంటి పాకిస్థాన్ జట్టును గతంలో తామెన్నడూ చూడలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 
 
వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా ఈ నెల 14న అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. వన్ సైడెడ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లో పాక్ జట్టు పూర్తిగా విఫలమైంది. 
 
మరోవైపు దాయాదుల మధ్య రసవత్తరమైన హై ఓల్టేజ్ మ్యాచ్ వీక్షించాలని స్టేడియంకు వచ్చిన వారంతా... లో ఓల్టేజ్ మ్యాచ్ ని చూసి పూర్తిగా నిరాశ చెందారు, ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.
 
పాకిస్థాన్ జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ... తాము ఆడే రోజుల్లో పాకిస్థాన్ టీమ్ ఇలా ఉండేది కాదని చెప్పారు. వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ తో పాక్ జట్టు చాలా బలంగా ఉండేదని అన్నారు. ఇప్పుడున్నటువంటి పాక్ జట్టుతో తాము ఏరోజూ ఆడలేదని చెప్పారు. 
 
ప్రస్తుత పాక్ జట్టు పేపర్ మీద మాత్రమే పటిష్టంగా కనిపిస్తోందని అన్నారు. పాక్ బ్యాట్స్ మెన్లు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. ఇలాంటి జట్టుతో వరల్డ్ కప్‌లో పాక్ నెట్టుకు రావడం కష్టమేనని అన్నారు. పాక్ స్టార్ బ్యాట్స్ మెన్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌‌ల బ్యాటింగ్‌లో కూడా తనకు కసి కనిపించలేదని... టెక్నిక్ తెలియనట్టు, భయపడుతూ ఆడుతున్నట్టే అనిపించిందని చెప్పారు.