శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By ivr
Last Updated : బుధవారం, 25 మార్చి 2015 (15:18 IST)

గెలిచిన కివీస్ గురించి కాదు... ఓడిన సఫారీల గురించే ప్రపంచం మాట్లాడుతోంది... ఎందుకు...?

దక్షిణాఫ్రికా... ఫైనల్ బెర్తు ఖాయం అనుకునేంత నమ్మకాన్ని కల్గించింది. చిట్టచివరి 5 బంతులు వారి తల రాతను మార్చేశాయి. ఇలియట్ కొట్టిన సిక్స్ కు మైదానంలో కివీస్ బ్యాట్సమన్లు ఇద్దరూ కేరింతలు కొడితే ఆడుతున్న 11 మంది సఫారీలు కళ్ల వెంట కన్నీరు కార్చారు. ప్రపంచం అంతా ఇప్పుడు సఫారీల ఓటమిపై తమ బాధను వ్యక్తం చేస్తోంది. విజయపుటంచుల దాకా వెళ్లిన ఆ జట్టు సభ్యులకు ఓదార్పు వచనాలను పోస్ట్ చేస్తోంది. సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో అయితే దక్షిణాఫ్రికా జట్టు సభ్యులను ప్రశంసలతో ముంచెత్తుతూ ట్వీట్లు, పోస్టింగులు వెల్లువెత్తుతున్నాయి. 
 
ముఖ్యంగా చాంపియన్ డివిలియర్స్ వంటివారి గురించి, వారి గత చరిత్రను చెపుతూ వారి దుఃఖాన్ని పారదోలేందుకు ప్రయత్నిస్తున్నారు. డివిలియర్స్ గురించి ట్విట్టర్లో... తన కెరీర్లో డివిలియర్స్ రగ్బీ జూనియర్ స్థాయి జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించాడు. అండర్ 19 నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్, సైన్స్ ప్రాజెక్టులో మండేలా నుంచి జాతీయ పతకాన్ని అందుకున్నాడు. 
 
ఇక క్రికెట్ విషయానికి వస్తే తన 87 టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం 3సార్లు మాత్రమే డకౌట్ అయ్యాడు. ఇంకా ఇలాంటి ఎన్నో అద్భుతాలు డివిలియర్స్ సొంతం. అలాగే సఫారీల జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు చిచ్చరపిడుగే. కాకపోతే మన పెద్దవాళ్లు చెప్పినట్లు.... కొన్నిసార్లు మన అదృష్టం కంటే దురదృష్టం వేగంగా పరుగెడుతుంది. అప్పుడే ఇలాంటి శోకం కలుగుతుంది.