శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 16 జూన్ 2017 (06:05 IST)

సెంచరీ చేయడానికి లక్ష్యమే సరిపోలేదు.. గెలుపు ముందు అదెంత అంటున్న కోహ్లీ

90 పరుగులు సాధించిన తర్వాత ఆట లక్ష్యం ఎటుపోయినా పర్వాలేదు.. సెంచరీ కొట్టడమే ధ్యేయంగా జిడ్డు ఆటను మొదలుపెట్టి ప్రేక్షకులను, టీమ్‌ మేనేజ్‌మెంటును విసుగెత్తించే దిగ్గజ ఆటగాళ్లను చాలామందినే చూశాం. కానీ సెంచరీ చేయడానికి అవకాశం అందుబాటులో ఉండి కూడా దాన్ని

90 పరుగులు సాధించిన తర్వాత ఆట లక్ష్యం ఎటుపోయినా పర్వాలేదు.. సెంచరీ కొట్టడమే ధ్యేయంగా జిడ్డు ఆటను మొదలుపెట్టి ప్రేక్షకులను, టీమ్‌ మేనేజ్‌మెంటును విసుగెత్తించే దిగ్గజ ఆటగాళ్లను చాలామందినే చూశాం. కానీ సెంచరీ చేయడానికి అవకాశం అందుబాటులో ఉండి కూడా దాన్ని పట్టించుకోకుండా అవతలి ఎండ్‌లో ఉన్న తోటి బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇచ్చే ఆ వైఖరిని ఏ పదాలతో పొడగాలి మరి.

నాలుగు పరుగులు చేస్తే సెంచరీ ఖాయం అనిపిస్తున్న క్షణాల్లో కూడా తనకు గెలుపే తప్ప పరుగులు, రికార్డులు మరేవీ ముఖ్యం కాదని చెపుతూ టీమ్ గెలుపుకోసం పడి చచ్చే ఆ గొప్ప క్రీడా స్ఫూర్తిని ఏమని పిలవాలి. గెలుపు తప్ప మరేమీ పట్టించుకోని ఆ విరాణ్మూర్తి పేరు పెడితే విరాట్ కోహ్లీ అవుతుంది.
 
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ చేరుకున్న వేళ.. ఈసారి దంచేస్తామంటూ తొడకొట్టిన బంగ్లాదేశ్‌ను కసిదీరా, చిత్తు చిత్తుగా కొట్టేసిన వేళ.. యావద్భారతం బంగ్లాజట్టుపై భారత్ గెలుపుతో పండగ చేసుకుంటున్న వేళ.. ఛేదనలో రోహిత్‌ మంత్రముగ్దమైన ఆటతో మంచి నీళ్లు తాగినంత తేలిగ్గా శతకం బాదేసిన క్షణంలో టీమిండియా కేప్టెన్ 96 పరుగుల వద్ద ఇక చాలని సరిపెట్టుకున్నాడు.

రికార్డుల కోసం కక్కుర్తి పడే మరే బ్యాట్స్‌మన్ అయినా సరే స్ట్రైక్ తాను తీసుకుని ఎలాగోలా సెంచరీ పూర్తి చేసి మమ అనిపించేవాడు. కానీ ఇక్కడ ఉన్నది కోహ్లీ కదా.. సెంచరీ చేయడానికి లక్ష్యమే సరిపోలేదు అని చెప్పడం మాటవరసకే కాని సాధిస్తున్న గెలుపు ముంగిట సెంచరీతో పనేమిటి అనుకునే అరుదైన గుణం కోహ్లీ సొంతం. 
 
78 బంతుల్లో 96 పరుగులు వద్ద కోహ్లీ పరుగు ఆగిపోయింది. పది ఓవర్లు ఉండగానే విజయ లక్ష్యం దాటిపోయింది. అది కూడా కోహ్లీ కొట్టిన ఫోర్ తోనే ఆట ముగిసింది. గేమ్ ముగిసిన తర్వాత మీడియా ముందుకొచ్చిన  కోహ్లీ గెలుస్తున్న క్షణంలో పరుగుల సంఖ్య పెద్ద విషయమే కాదనేశాడు.

"కీలకమైన మ్యాచ్‌లో నేను బ్యాటింగ్ చేసిన తీరు ముఖ్యం. ఛేదనలో నా బ్యాటింగు పట్ల ఎంతో ఆస్వాదించాను. ఐపీఎల్ తర్వాత నా సన్నాహకం, నా ప్రాక్టీస్ ఫలితం నా కళ్లముందే కనబడుతుంటే చాలా సంతోషం వేసింది. ఎన్ని వికెట్లతో గెలిచామన్నది కూడా ముఖ్యం కాదు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నన్ను నేను స్థిమితపర్చుకున్నాను. ఒక్క వికెట్ ప్రారంభంలో కోల్పోయిన వెంటనే గేమ్‌నే శ్రీలంకకు జారవిడుచుకున్న తర్వాత మళ్లీ అలాంటి చాన్స్ ఎవరికీ ఇవ్వవద్దనుకున్నాను. ..

ఈరోజు టీమిండియా విజయానికి పూర్తి ఘనత నా ఖాతాలో వేసుకోలేను. ఎందుకంటే రోహిత్, శిఖర్ ధావన్ అద్భుతంగా ఆడారు. ఇలాంటి ఆటవల్లే మనం నిబ్బరంగా వ్యూహాలు అమలు చేయగలం. ప్రత్యేకించి శిఖర్ ధావన్ ఆడిన తీరు అద్వితీయమనే చెప్పాలి. రోహిత్, ధావన్ ప్రత్యర్థిని మానసికంగా చెండాడేశారు. బ్యాట్ మీదికి నేరుగా వస్తున్న బంతి, వేగంగా బంతి పరుగెత్తే మైదానపు అంచు అన్నీ బాగా కుదిరాయి కాబట్టే ఇంత గొప్ప ప్రదర్శన చేయగలిగాము" అని కోహ్లీ గురువారం నాటి ఆట గురించి వ్యాఖ్యానించాడు.