శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 14 జులై 2019 (08:57 IST)

నేడు తుదిపోరు : 27 యేళ్ళ తర్వాత ఫైనల్‌కు.. ప్రాధేయపడుతున్న న్యూజిలాండ్

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సమరం నేటితో ముగియనుంది. ఆదివారం ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగే తుది పోరులో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో న్యూజిలాండ్ జట్టు తలపడనుంది. ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌కు ఇంగ్లండ్ జట్టు 27 యేళ్ల తర్వాత అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌ను దేశ వ్యాప్తంగా ఉచితంగా ప్రసారం చేయనున్నట్టు ప్రకటించింది. 
 
సబ్‌స్క్రిప్షన్ ధరలు భారీగా ఉండటంతో చాలామంది ఇంగ్లీష్ ఫ్యాన్స్ క్రికెట్ మ్యాచ్‌లను టీవీల్లో వీక్షించలేక పోతున్నారు. అటు ఇంగ్లండ్ కూడా 27 ఏళ్ళ తర్వాత వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరడంతో అభిమానుల సంతోషం కోసం బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయానికి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
 
మరోవైపు, న్యూజిలాండ్‌ కూడా తొలిసారి ఫైనల్‌కు చేరింది. దీంతో ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్‌కు టిక్కెట్స్ లభించడం లేదు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత అభిమానుల వద్ద ఉన్న టిక్కెట్లను తమకు ఇవ్వాలని ప్రాధేయపడుతున్నారు. 
 
వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్‌కు భారత్ చేరుతుందని అంచనా వేసిన, బ్రిటన్‌లోని ఇండియన్స్, ఫైనల్ మ్యాచ్‌ని చూసేందుకు పెద్దఎత్తున ముందుగానే టికెట్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఇండియా ఫైనల్‌కు రాకపోవడంతో, వారంతా ఆసక్తిగా స్టేడియానికి వచ్చే అవకాశం లేదన్నది న్యూజిలాండ్ అభిమానుల వాదన. 
 
అందువల్ల ఆ టిక్కెట్లను తమకు ఇస్తే తాము మ్యాచ్‌ని చూస్తామంటూ, సోషల్ మీడియా ద్వారా పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఏ ఇండియన్ వద్దయినా ఫైనల్ టికెట్ ఉంటే, వారి వద్దకు వచ్చి, డబ్బులిచ్చి తీసుకువెళతామని అంటున్నారు. తమకు టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.