కులాంతర వివాహం చేసుకుందనీ.. సోదిరిని వెంటాడి గొడ్డళ్ళతో నరికి చంపిన సోదరులు
మహారాష్ట్రలో పరువు హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న తమ సోదరిని ఇద్దరు సోదరులు కలిసి వెంటాడి, వేటాడి గొడ్డళ్ళతో నరికి చంపేశారు. మానవత్వానికే మచ్చతెచ్చే ఈ దారుణం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సోయగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో మాయత్ చంద్రకళ అనే యువతి వేరే కులానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. దీన్ని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆమె తాను ప్రేమించిన వ్యక్తితో అతడి ఇంట్లోనే సహజీవనం చేస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న యువతి ఇద్దరు సోదరులు జీర్ణించుకోలేక పోయారు. ఆమెను చంపేందుకు గొడ్డళ్లతో బయలుదేరారు. ఈ విషయం తెలిసిన యువతి.. ఓ వ్యక్తి సహాయంతో సమీపంలో ఉన్న మేకల కొట్టంలో దాక్కుంది. ఆగ్రహంతో ఊగిపోతున్న నిందితులు.. ఆమె కోసం వెతికారు.
అనంతరం మేకల కొట్టంలో దాక్కున్న ఆమెను పట్టుకుని గొడ్డళ్లతో దారుణంగా నరికారు. తీవ్రంగా గాయపడ్డ యువతి రక్తపు మడుగులో కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. బాధితురాలికి సహాయం చేసిన వ్యక్తిపై కూడా నిందితులు దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు యువతి సోదరులతో పాటు ఆమె తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.