ఉప్మా దోసె ఇవ్వమంటే ప్లెయిన్ దోసె ఇచ్చారేంటని ప్రశ్నిస్తే కత్తితో పొడిచారు (video)
చిన్న విషయానికి ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. తను ఆర్డర్ చేసిన ఉప్మా దోసె ఇవ్వకుండా ప్లెయిన్ దోసె ఇచ్చారు ఓ హోటల్ సిబ్బంది. ఇంటికెళ్లి చూసుకున్న అతడు తను ఆర్డర్ ఇచ్చింది కాకుండా వేరే దోసె ఎందుకు ఇచ్చారని ప్రశ్నించినందుకు కత్తితో పొడిచేసారు.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. విజయవాడలోని వెల్కమ్ హోటల్లో శనివారం రాత్రి అబ్దుల్ కరీం అనే వ్యక్తి ఉప్మా దోసె ఆర్డర్ చేసాడు. ఐతే పార్సిల్లో ఉప్మా దోసెకు బదులు ప్లెయిన్ దోసె ఇచ్చారు. ఇంటికి వెళ్లి చూసుకున్న కరీం తను ఆర్డర్ చేసింది కాకుండా వేరే దోసె ఇవ్వడంతో దాన్ని తీసుకుని హోటల్ వద్దకు వచ్చాడు.
తను ఆర్డర్ ఇచ్చినది కాకుండా వేరే దోసె ఎలా ఇచ్చారంటూ హోటల్ సిబ్బందిని నిలదీయడంతో మాటామాటా పెరిగింది. దీనితో అబ్దుల్ కరీంపై హోటల్ సిబ్బంది కత్తితో దాడి చేసారు. అతడి మెడపైన తీవ్ర గాయం అయ్యింది. మెడపై 12 కుట్లు పడ్డాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.