శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (09:48 IST)

పండగ రోజున కొడుకు ఇంటికి రాలేదని తల్లి ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలో కొడుకుపై అమితమైన ప్రేమను పెట్టుకున్న ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. పండగ రోజున తన బిడ్డ ఇంటికి రాకపోవడంతో కలత చెందిన ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని మోడల్ కాలనీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మోడల్‌ కాలనీకి చెందిన దండ బుచ్చిబాబు, సుజాత(53) కుమారుడు యోగకు గత ఆగస్టులో వివాహమైంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు అయిన కుమారుడు, కోడలు విశాఖపట్నంలో స్థిరపడ్డారు. 
 
దీపావళి పండగ నాటికి ఇంటికి రావాలని సుజాత కుమారుడిని కోరింది. కానీ, సెలవు లేకపోవడంతో వారు రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె అప్పట్నుంచి ముభావంగా ఉంటోంది. 
 
ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున భర్త పెంట్‌హౌస్‌లో నిద్రపోగా సుజాత కింది అంతస్తులో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.