మేడపై నిద్రపోదామన్న భార్య.. ఆగ్రహంతో కుమార్తెను చంపేసిన భర్త... ఎక్కడ?
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో దారుణం జరిగింది. ఇంటి మేడపై నిద్రపోదామన్నందుకు కట్టుకున్న భార్యపై కట్టుకున్న భర్త కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో అడ్డు వచ్చిన 19 ఏళ్ల కుమార్తెను 17 సార్లు దారుణంగా పొడిచి చంపేశాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో జరిగింది.
జిల్లాలోని కడోదరలో బిహార్‌కు చెందిన రామానుజ్ మహదేవ్ సాహు కుటుంబం నివసిస్తోంది. మహదేవ్ స్థానికంగా మిల్లులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈయనకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. గురువారం రాత్రి.. మహదేవన్ను అతడి భార్య రేఖాదేవి ఇంటి మేడపై నిద్రపోదామని అడిగింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
భార్యతో గొడవ జరిగిన తర్వాత మహదేవ్ సాహు.. ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తర్వాత పదునైన కత్తితో వచ్చి రేఖాదేవిపై దాడికి యత్నించాడు. అదేసమయంలో తల్లిని కాపాడేందుకు కుమార్తె చంద్కుమారి వెళ్లింది. దీంతో ఆగ్రహానికి గురైన మహదేవ్.. ఆమెపై కత్తితో 17 సార్లు దాడి చేశారు.
దీంతో చందకుమారి అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి దాడిలో ముగ్గురు కుమారులు సూరజ్, ధీరజ్, విశాల్ కూడా గాయపడ్డారు. భార్యాపిల్లలపై దారుణానికి ఒడిగొట్టిన మహదేవ్.. ఘటన తర్వాత పరారయ్యాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.