పడక సుఖం ఇవ్వలేదనీ బాలిత అయిన భార్యను హత్య చేసిన భర్త
తనకు పడక సుఖం ఇవ్వడం లేదన్న అక్కసుతో బాలిత అయిన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడో భర్త. ఈ ఉదంతం తెలంగాణ రాష్ట్రంలోని సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోస్టుమార్టం నివేదిక అసలు విషయాన్ని బహిర్గతం చేసింది. దీంతో నిందితుడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని చారుకొండ ప్రాంతం అగ్రహారం తండాకు చెందిన జటావత్ తరుణ్ (24), ఝాన్సీ (20) ప్రేమించుకుని 2021లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. నగరానికి వచ్చి ఐఎస్ సదన్ డివిజన్ ఖాజాబాగ్‌లోని మదర్సా అష్రఫ్ ఉల్ ఉలూం పరిసరాల్లో ఉంటున్నారు. తరుణ్ ఆటోడ్రైవర్. వీరికి రెండేళ్ల కుమారుడున్నాడు. గత ఏప్రిల్ 16వ తేదీన మరో ఆడబిడ్డకు ఝాన్సీ జన్మనిచ్చింది.
మే 20వ తేదీన అర్థరాత్రి తన కోరికను తీర్చాలని భార్యను తరుణ్ కోరాడు. అయితే, తనకు నీరసంగా ఉందని ఆమె శారీరక సుఖానికి సమ్మతించలేదు. దీంతో భర్త వినిపించుకోకుండా బలవంతం చేస్తుండటంతో ఆమె బిగ్గరగా కేకలు వేసేందుకు ప్రయత్నించడంతో ఆగ్రహంతో తరుణ్ తన కుడిచేతితో ఆమె తలను మంచంపై అదిమి పెట్టాడు. ముక్కు, నోటి మీద అరచేతిని కొంతసేపు అలాగే ఉంచడంతో ఆమెకు శ్వాస ఆడలేదు. ఈ క్రమంలో ఝాన్సీ నోటిలో నుంచి నురగలు వచ్చి అపస్మారకస్థితికి చేరుకుంది.
ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న తమ బంధువులకు తరుణ్ సమాచారం చేరవేయడంతో వారంతా కలిసి హుటాహుటిన కంచన్‌బాగ్‌లోని ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించి పోలీసులకు సమాచారమివ్వగా వారు వచ్చి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి శవపరీక్షకు తరలించారు.
ఝాన్సీ తండ్రి నెనావత్ రేఖ్యా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తరుణ్ ఏమీ తెలియనట్లే ఉన్నాడు. మంగళవారం పోస్టుమార్టం నివేదిక రావడంతో అసలు విషయం బహిర్గతమైంది. తరుణ్‌ను అదుపులోకి తీసుకుని వారు విచారించగా ఆరోజు రాత్రి జరిగిన విషయాన్ని వెల్లడించాడు. నిందితుడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.