మహిళ ఇంట్లోకి దుస్తుల్లేకుండా వెళ్లిన వైకాపా నేత... పట్టించుకోని పోలీసులు
నంద్యాల జిల్లాలో వైకాపా నేత కీచకపర్వానికి తెరతీశాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికి నిందితుడు నానా తంటాలు పడ్డాడు. చివరకు బాధిత మహిళ ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. నిందితుడు అధికార వైకాపా నేతతో పాటు వైకాపా ఎంపీటీసీ సభ్యుల సంఘం ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు కూడా కావడంతో పోలీసులు మొక్కుబడి సెక్షన్లతో సరిపెట్టారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు... నంద్యాల జిల్లా అవుకు మండలం నిచ్చెనమెట్ల గ్రామానికి చెందిన మహిళ (38) భర్త చనిపోగా, పదేళ్ల కుమారుడిని పోషించుకుంటూ ఒంటరిగా ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె నిద్రిస్తున్న సమయంలో అన్నవరం ఎంపీటీసీ సభ్యుడు జి. గోపాల్ రెడ్డి మద్యం సేవించి.. ఒంటిపై దుస్తుల్లేకుండా ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమె వెంటనే మేల్కొనగా, అసభ్యంగా ప్రవర్తించాడు.
బాధితురాలు గోపాల్ రెడ్డిని బయటకు నెట్టి గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు పోగయ్యారు. మహిళ తన అత్తమామల్ని పిలుచుకురమ్మని కుమారుడిని పంపారు. ఇంతలో గోపాల్ రెడ్డి అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నామమాత్రపు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.
దీనిపై బాధితారులు మాట్లాడుతూ, నాకు భర్త లేడు. నా బిడ్డ చిన్నపిల్లవాడు. గోపాల్ రెడ్డి మా ఇంటికి తాగేసి, దుస్తుల్లేకుండా వచ్చాడు. నా చేయి పట్టుకున్నాడు. చెప్పలేని మాటలతో తిట్టాడు. కొట్టాడు. ఒకసారి ఇంట్లోంచి బయటకు పంపిన తర్వాత మళ్లీ వచ్చాడు. గతంలోనూ ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయి. నా మామతోనూ గొడవపడ్డాడు. పరాయి మనిషి మా ఇంట్లోకి రావొచ్చా? నాకు భయంగా ఉంది. అతని నుంచి ఎప్పటికైనా ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశాను. ఇందులో ఎవరి ఒత్తిడి లేదు. కేసులో రాజీ అయ్యే ప్రసక్తే లేదు. ధైర్యంగా ఎదుర్కొంటాను అని ప్రకటించారు.