చర్చికి వెళ్లిన మహిళపై ఫాస్టర్ అత్యాచారం.. ఎక్కడ?
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో చర్చికి వెళ్లిన మహిళపై చర్చి ఫాస్టర్ అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలైన వివాహిత పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం అధికార వైకాపాకు చెందిన ఓ కీలక నేతకు తెలియడంతో ఆ దారుణానికి రూ.40 వేలు వెలకట్టించాడు. ఈ దారుణ ఘటన శనివారం వెలుగు చూసింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు జిల్లాలోని ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెంకు చెందిన ఓ ఫాస్టర్ చర్చికి వచ్చే వివాహితపై కన్నేశాడు. ఇంట్లో పని ఉందని తీసుకెళ్లి తాళాలేసి, ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు భర్తకు, తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు 7వ తేదీన ఇందుకూరుపేట పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు.
దీంతో ఆ ఫాస్టర్ వైకాపాలోని కీలక నేతను ఆశ్రయించారు. ఆయన కేసు వాపసు తీసుకోవాలని బాధితురాలితో పాటు కుటుంబసభ్యులను బెదిరించారు. రూ.40 వేలు బాధితురాలికి, పోలీసులకు రూ.10 వేలు ఇచ్చేలా సర్పంచి ఆ పత్రంపై సంతకాలు చేయించారు. బాధిత కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో బెదిరింపులకు పాల్పడుతున్నారు.