మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జనవరి 2024 (07:27 IST)

లిఫ్టు ఇచ్చారంటే.. అంతే సంగతులు.. కి'లేడీ'తో జర జాగ్రత్త...

arrest
ముఖానికి మాస్క్‌ ధరించి... టిప్పుటాపుగా తయారై లిఫ్టు అడిగే మహిళల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మహిళల మాయల గారడీలో పడి లిఫ్టు ఇచ్చారంటే మాత్రం అంతేసంగతులని వారు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఇలాంటి కిలేడీని హైదరాబాద్ నగరంలో అరెస్టు చేశారు. 
 
బంజారాహిల్స్‌లో ఇటీవల జరిగిన ఇలాంటి ఉదంతంలో ఒక మహిళ అరెస్ట్‌ కాగా.. బుధవారం జూబ్లీహిల్స్‌ ఠాణా పరిధిలో అదే రీతిలో వ్యవహరిసున్న మరో మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బంజారాహిల్స్‌ రేషంబాగ్‌ ప్రాంతంలో నివసించే కారు డ్రైవర్‌ పరమానంద మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి కేబీఆర్‌ ఉద్యానవనం వైపు కారులో వెళ్తున్న క్రమంలో చెక్‌పోస్టు వద్ద ఓ మహిళ లిఫ్టు అడిగింది. దీంతో ఆయన ఆమెను కారులో ఎక్కించుకొని కొద్ది దూరం వెళ్లాడు. 
 
ఆ తర్వాత తనకు డబ్బులు ఇవ్వాలని.. లేకుంటే లైంగిక దాడికి పాల్పడ్డావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. కంగారుపడిన అతడు ఆమెను తీసుకొని బంజారాహిల్స్‌ ఠాణాకు వెళ్లాడు. ఇన్‌స్పెక్టర్‌ పి.సతీష్‌కు విషయం అర్థమై వారిని జూబ్లీహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. దర్యాప్తుల భాగంగా ఆమెను నయిమా సుల్తానా(32)గా గుర్తించారు. 
 
తనను తాను న్యాయవాదిగా చెప్పుకుని తిరుగుతున్న ఆమె వద్ద లభించిన పుస్తకంలో పలు ఆధారాలను పోలీసులు గుర్తించారు. ఆమెపై హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్లలో డిన 15కిపైగా కేసులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెను అరెస్ట్‌ చేశారు. ఆమె గురించి తెలుసుకోవడానికి బార్‌ అసోసియేషన్‌కు లేఖ రాయనున్నట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపారు.