ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2024 (09:20 IST)

తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారులు.. ఎక్కడ?

crime
గుజరాత్ రాష్ట్రంలోని సబరకాంత దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తాను చేసిన అప్పును సకాలంలో తీర్చలేకపోయాడు. దీంతో అతని ఏడేళ్ల కుమార్తెను వడ్డీ వ్యాపారులు కిడ్నాప్ చేసి, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని విక్రయించారు. ఈ దారుణంపై బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో వారు వేగంగా స్పందించి వడ్డీ వ్యాపారులను, బాలికను కొనుగోలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసి, ఆ బాలికను కూడా రక్షించారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... సబరకాంత జిల్లాకు చెందిన ఓ రోజు కూలీ అదే ప్రాంతానికి చెందిన అర్జున్ నాథ్ అనే వడ్డీవ్యాపారి వద్ద అధిక వడ్డీకి రూ.60 వేలు అప్పు తీసుకున్నాడు. క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ అర్జున్ నాథ్ వేధింపులకు గురిచేయసాగాడు. ఈ క్రమంలో అసలు రూ.3 లక్షలకు పెరిగిందని చెప్పి మొత్తం తిరిగివ్వాలని డిమాండ్ చేశాడని చెప్పారు. 
 
మరో ఇద్దరు వడ్డీ వ్యాపారులు షరీఫానాథ్, లఖ్‌పతినాథ్‌లతో కలిసి ఇటీవల తనపై దాడి చేశాడని చెప్పారు. తనను తీవ్రంగా కొట్టి ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. ఆపై ఏడేళ్ల తన కూతురును కిడ్నాప్ చేసి రూ.3 లక్షలకు అమ్మేసినట్లు చెప్పారు. ఈ బాలికను రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ సమీపంలో ఉన్న ఓ గ్రామస్థుడు కొనుగోలు చేశాడు. 
 
దీనిపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించి వడ్డీ వ్యాపారులు ముగ్గురినీ అరెస్టు చేశామని పోలీసులు వివరించారు. వారి ద్వారా రాబట్టిన వివరాల ఆధారంగా రాజస్థాన్ వెళ్లి బాలికను కాపాడి తీసుకొచ్చామని తెలిపారు. నిందితులు ముగ్గురినీ కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. ఎఫ్ఎస్ఐఆర్ నమోదైన గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసి బాలికను కాపాడినట్లు పేర్కొన్నారు.