శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

మాట్లాడుకుందాం రమ్మని పిలిచి యువకుడిని నరికి చంపేసిన యువతి బంధువులు

murder
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో దారుణం జరిగింది. పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. మాట్లాడుకుందాం రా.. అంటూ యువకుడుని పిలిపించిన యువతి బంధువులు కత్తులతో నరికి చంపేశారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
త్రిపురారం మండలం అన్నారం గ్రామానికి చెందిన ఇరిగి నవీన్ (21) మిర్యాలగూడలో కారు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఈ యువకుడు అదే గ్రామానికి చెందిన 20 యేళ్ల యువతిని గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఆమెకు ఇంట్లో సంబంధాలు చూస్తున్న విషయం తెలిసిన నవీన్... ఇటీవల విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చివరకు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు.. నవీన్‌పై కోపం పెంచుకున్నారు. పలుమార్లు మందలించారు. అతనికి ఫోన్ చేసిన ఆమెను మర్చిపోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ క్రమంలో నవీన్ ఆదివారం అన్నవరానికి చెందిన మిత్రుడు ఈట అనిల్‌తో కలిసి నిడమనూరు మండలం గుంటిపల్లికి చెందిన పాల్వాయి తిరుమల్‌ వద్దకు వచ్చి అమ్మాయి కుటుంబ సభ్యులతో మాట్లాడి తమ పెళ్లికి ఒప్పించాలని కోరాడు. 
 
ఇందుకు సరేనని చెప్పిన తిరుమల్.. ఈ విషయాన్ని యువతి బంధువులకు ఫోన్ చెప్పడంతో వారు కూడా అందుకు అంగీకరించి యువతి బంధువులు 9 మంది బైకుపై అక్కడి చేరుకున్నారు. వస్తూనే నవీన్‌పై కత్తులతో దాడి చేశారు. తిరుమల్, అనిల్‌ను బెదిరించడంతో వారు అక్కడ నుంచి పారిపోయారు. నవీన్ కూడా భయంతో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా, కొంతదూరం వెళ్లి కిందపడిపోయాడు. 
 
అదే అదునుగా భావించిన యువతి బంధువులు అతన్ని పట్టుకుని ఛాతి, పొట్ట భాగాల్లో విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. అది చూసిన స్థానకిులు అక్కడికి వచ్చే సరికి నవీన్ ప్రాణాలు విడిచాడు. నవీన్ మిత్రుడు అనిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.