శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (14:29 IST)

కత్తులు దూస్తున్న జయలలిత - కరుణానిధి : అన్నాడీఎంకే - డీఎంకే 169 సీట్లలో ప్రత్యక్ష పోటీ

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటములు, పొత్తులు, రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ ఈ దఫా ఎన్నికల్లో మాత్రం ప్రధాన పోటీ మాత్రం డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే అని దాదాపుగా తేలిపోయింది. ఈ రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు ఏకంగా 169 స్థానాల్లో ప్రత్యక్షంగా తలపడనున్నారు. ఇప్పటికే ఈ రెండు పార్టీలు అభ్యర్థుల జాబితాను వెల్లడించాయి. దీంతో దాంతో డీఎంకే, అన్నాడీఎంకేలు ఏయే స్థానాల్లో పోటీ చేస్తున్నాయనేది తేలిపోయింది. గత ఎన్నిలకు భిన్నంగా ఈ ఎన్నికల్లో పంచముఖ పోరాటం సాగుతున్నా ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ మాత్రం ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యే కనిపిస్తోంది. 
 
గత 2011 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అత్యధికంగా 63 స్థానాలు కేటాయించిన ఆ పార్టీ ఫలితాల్లో దారుణంగా దెబ్బతింది. కాంగ్రెస్‌ కూడా కేవలం ఐదు స్థానాల్లోనే గెలిచింది. ఇప్పుడు అలా వ్యవహరించకుండా మిత్రపక్షాలన్నిటికీ కలిపి కేవలం 61 స్థానాలు మాత్రమే డీఎంకే కేటాయించింది. ఈ స్థానాల పంపకాలు అన్నీ బేరీజు వేశాక మొత్తం 169 స్థానాల్లో ఆ పార్టీ అన్నాడీఎంకే అభ్యర్థులతో నేరుగా తలపడబోతోంది. ఇక అన్నాడీఎంకే మిత్రపక్షాలకు కేవలం ఏడు స్థానాలే కేటాయించింది. అవి కూడా అన్నాడీఎంకే ఎన్నికల చిహ్నం రెండాకులుపైనే పోటీ చేయాల్సి రావడంతో సాంకేతికంగా ఆ పార్టీ మొత్తం 234 స్థానాలకూ పోటీ చేస్తున్నట్లే.
 
అన్నాడీఎంకే, డీఎంకేల మధ్య పలు స్థానాల్లో ఆ పార్టీలోని కీలక నేతల మధ్య ప్రత్యక్ష పోరాటం జరగనుంది. తిరువారూరు నుంచి డీఎంకే నేత కరుణానిధి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఆయనపై అన్నాడీఎంకే స్థానికంగా పట్టున్న ఏఎన్‌ఆర్‌ పన్నీర్‌సెల్వంను పోటీకి దింపుతోంది. కొళత్తూరు నుంచి పోటీ చేస్తున్న స్టాలిన్‌పై అన్నాడీఎంకే శాసనసభ్యుడు జేసీడీ ప్రభాకర్‌ పోటీ చేస్తున్నారు. ఇక ఆర్‌కే నగర్లో జయలలితపై డీఎంకే కూడా వ్యూహాత్మకంగా స్థానికంగా మంచి పట్టున్న సిమ్లా ముత్తుచోళన్‌ను పోటీకి దింపింది. 
 
దాంతో ఈ నియోజకవర్గాల్లో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. చెన్నై మాజీ మేయర్‌ సుబ్రహ్మణియన్‌ డీఎంకే నుంచి సైదాపేట అభ్యర్థిగా నిలబడుతుంటే ఆయనపై మాజీ మంత్రి సి.పొన్నయన్‌ను రంగంలోకి దింపింది. తిరుచ్చి పశ్చిమంలో డీఎంకే మాజీ మంత్రి కేఎన్‌ నెహ్రూపై అన్నాడీఎంకే మనోహరన్‌ను నిలబెడుతోంది. ఇలు పలు ప్రాంతాల్లో డీఎంకే మాజీ మంత్రులు, అన్నాడీఎంకేలో కీలకనేతలు రంగంలోకి దిగారు. ఈ రెండు పార్టీల మధ్యే ఈ నియోజకవర్గాల్లో ప్రధానంగా పోటీ నెలకొననుండటంతో రెండు వర్గాలు అక్కడ ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధంగా ఉన్నాయి.