గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: శనివారం, 16 నవంబరు 2019 (16:02 IST)

తప్పును సరిదిద్దేందుకు మరో తప్పు చేస్తున్న ఎపి మంత్రులు...

ఒక తప్పు చేసి దాన్ని సరిదిద్దుకునేందుకు అనేక తప్పులు చేసినట్లుంది ఎపిలోని కొంతమంది మంత్రులు, అధికారుల తీరు. కీలకమైన అంశాలకు సంబంధించి ఇష్టమొచ్చిన రీతిలో జిఓలను జారీ చేసేయడం.. తరువాత ఆ తప్పులను సరిదిద్దుకునే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిభ అవార్డులకు కలాం పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టి ఆ తరువాత దాన్ని సరిదిద్దడానికి మంత్రి, అధికారులు పడిన పాట్లు విమర్సలకు దారితీస్తోంది.
 
చదువుల్లో విశేష ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం ప్రతిభ అవార్డులను ఇవ్వడం చాలాకాలంగా వస్తున్న ఆనవాయితీ. ఈ ప్రతిభ అవార్డులను మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరుతో ఇచ్చేవారు. దాన్ని సవరిస్తూ కలాం పేరుతో కాకుండా వైఎస్ఆర్ పేరుతో ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం కొన్నిరోజుల క్రితం ఒక జిఓను జారీ చేసింది.
 
ఇది పెద్ద దుమారాన్నే రేపింది. దీంతో సిఎం జగన్ ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. జిఓను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో దాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం మరో జిఓను జారీ చేసింది. అయితే ఆ జిఓను ఏదో మొక్కుబడిగా జారీ చేసినట్లుగా కనిపిస్తోంది. 
 
ఇక జిఓ జారీ చేసిన విధానం చూస్తే ఎవ్వరు జారీ చేశారు.. ఏ స్థాయి అధికారి జారీ చేశారన్న విషయాన్ని చెప్పకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా అప్రూడ్ బై నేమ్.. అప్రూడ్ బై డిసిగ్నేషన్ అంటూ పేరు లేకుండానే జిఓ జారీ చేశారు. ఈ తరహా జిఓలు ఎన్నడూ చూడలేదని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. సాంకేతికంగా ఈ తరహాలో జిఓ జారీచేసినప్పుడు ఇంతకుముందు తీసుకున్న నిర్ణయాన్ని సిఎం సూచనల మేరకు రద్దు చేస్తున్నప్పుడు తన పేరును, హోదాను దాచి ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
 
ఈవిధంగా క్యాన్సిలేషన్ జిఓ ఇస్తే ఆ తప్పు చేసిన అధికారి బయటపడకూడదనే, ఈ విధంగా పేరు, హోదా లేని జిఓ ఇచ్చారనే చర్చ సచివాలయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇదే సంధర్భంలో వైఎస్ఆర్ పేరుతో అవార్డులు ఇవ్వాలనే నిర్ణయాన్ని జిఓ 78 ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జిఓనే ప్రభుత్వం తరువాత క్యాన్సిల్ చేసింది. 
 
అయితే ఇంత జరుగుతున్నా ఆ శాఖా మంత్రి ఆదిమూలపు శేఖర్‌కు మాత్రం ఈ విషయం తెలియదట. దీనిపై మీడియా ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేశారట. ఇలా ఒక తప్పు చేసి మళ్ళీ మళ్ళీ అనేక తప్పులు మంత్రులు, ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలో చేస్తున్నారన్న విమర్సలు వినిపిస్తున్నాయి.