బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , బుధవారం, 29 సెప్టెంబరు 2021 (20:22 IST)

మ‌త్తు వ‌ద‌ల‌రా? ఆదివారం వారాంతంలో చిత్తు, జీవితం అంతం!!

అభంశుభం తెలియ‌ని యువతీయువ‌కులు కొంద‌రు వీకెండ్ క‌ల్చ‌ర్‌కి అల‌వాటుప‌డుతున్నారు. చెడు స్నేహితుల ప్ర‌భావంతో మెల్లిగా మ‌త్తుకు అల‌వాటుప‌డి, చివ‌రికి అదే అత్య‌వ‌స‌రంగా మారి, అన్నింటికీ చెడి... చివ‌రికి మ‌త్తుకు అనూహ్యంగా బలైపోతున్నారు. కాలేజీలు, యూనివ‌ర్సిటీ క్యాంప‌స్లు, హాస్ట‌ళ్ళు డ్ర‌గ్స్ వినియోగానికి అడ్డాలుగా మారుతున్నాయి. తెలిసీతెలియ‌క... ఫ్యాష‌న్‌గా మొద‌లై... పేష‌న్‌గా మారే ఈ దుర్వ్య‌స‌నంపై అంద‌రికీ అవ‌గాహ‌న అత్య‌వ‌స‌రం. యువ‌తీయువ‌కుల బంగారు భ‌విష్యత్తు, అర్ధాంత‌రంగా బుగ్గి కాకూడ‌ద‌ని... అవాయిడ్ డ్ర‌గ్స్ నినాదంతో వెబ్‌దునియా అందిస్తున్న ప్ర‌త్యేక క‌థ‌నం.
 
మ‌త్తు కోసం మ‌ద్యం తాగ‌డం అనాదిగా వ‌స్తున్న అన‌ర్ధ‌దాయ‌క వ్య‌స‌నం. దీని నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి, డీ అడిక్ష‌న్ సెంట‌ర్ల‌కు కుర్ర‌కారును, పిన్న‌వ‌య‌స్కుల‌ను... చివ‌రికి పెద్ద‌ల‌ను సైతం పంపుతున్నకుటుంబాలు ఎన్నో. ఇపుడు దీనికి మించిన సైతాన్ డ్ర‌గ్స్. డ్ర‌గ్ క‌ల్చ‌ర్ నెమ్మ‌ది నెమ్మ‌దిగా మొద‌లై, వేళ్ళూనుకుంటోంది. గంజాయి వాడ‌కం ఒక ఎత్తు అయితే, కొకెయిన్, హెరాయిన్, ఎల్ ఎస్డీ, మార్ఫిన్ వంటి రకరకాల డ్రగ్స్ పెనుభూతాల్లా యువ‌త‌ను క‌బ‌ళిస్తున్నాయి. 
 
చెడు సావాసాలు, చెడు ప్రాంతాలు మ‌నిషి ప‌త‌నానికి దారి తీస్తాయి. ముఖ్యంగా నేటి యువత చెడు సావాసంతోనే ఎక్కువగా డ్రగ్స్ వైపు ఆకర్షితుల‌వుతున్న‌ట్లు మాన‌సిక నిపుణుల స‌ర్వేలు నిర్ధ‌రిస్తున్నాయి. దుర‌దృష్ట‌వ‌శాత్తు కొన్నికాలేజీ క్యాంప‌స్‌లు, యూనివర్సిటీ క్యాంపస్‌లు, హాస్టళ్ళు వీటికి వేదిక‌లు అవుతున్నాయి. స‌ర‌దాగా మొద‌లైన డ్ర‌గ్స్ వాడకం, చివ‌రికి యువ‌త జీవితాల‌ను బ‌లిగొంటోంది.  
 
స్నేహితుల ఒత్తిడి... పీర్ ప్రెషర్! ఇదివరకే డ్రగ్స్‌కు అల‌వాటుప‌డి, త‌ర‌చూ తీసుకొంటున్న ఒక దుర్మార్గుడైన స్నేహితుడు ప‌క్క‌వాడివ‌ని ఒత్తిడి చేస్తాడు. "ఏమీ కాదు... జస్ట్ ఒకసారి ట్రై చెయ్యి... బాగోలేద‌ని అనిపిస్తే మానేద్దువు" అని ప్రోత్సహిస్తాడు. ఎక్సప్లోరింగ్ .. అంటే కొత్త విష‌యాలు తెలుసుకోవాలి అనే ఆసక్తి యువతలో ఎక్కువగా ఉంటుంది. ఇది తప్పు అని ఇంతమంది అంటున్నారు అంటే చూద్దాం... ఏమి జరుగుతుందో! అయినా నాపై నాకు నమ్మకం చాలా ఉంది. ఒక్కసారి తీసుకొనే మానేస్తా... నాపై నాకు ఫుల్ కంట్రోల్ ఉంద‌నే ఆత్మవిశ్వాసం... అదే చివ‌రికి వారి కొంప ముంచుతుంది. 
 
క్యూరియాసిటీ, మ‌తిమీరిన ఆత్మవిశ్వాసం, స్నేహితుడి ప్రోత్సాహం... ఇవీ చీకటి జగత్తుకు దిగజారడంలో మొదటి మెట్టు అవుతోంది. ఒకసారి డ్రగ్ తీసుకుంటే, ఇక ఇరవై నిమషాల్లో చిత్రమైన ప్రపంచం కనిపిస్తుంది. ఉదాహరణకు ఆసిడ్‌గా పిలిచే ఎల్ ఎస్డీ తీసుకొన్నాడు.

కంటి పాప పెద్దదయింది. కొత్త రంగులు కనిపించాయి. శబ్దానికి రంగులు వచ్చాయి. వాసనల‌కు రుచి. అదో  గమ్మత్తయిన జగత్తు, ఎప్పుడు చూడని జగత్తు, అదో మాయ ప్రపంచం, స్వర్గం అంటే అదేనేమో అనిపిస్తుంది. బ్రాంతి .. మొత్తం బ్రాంతి .. మూడ్ మారిపోయింది . ఇది కదా ప్రపంచం అనిపిస్తుంది. ఆ చెడు అనుభూతి కొన్ని గంటల పాటు ఉండిపోతుంది.  రెండు రాత్రుల పాటు నిద్ర రాదు. అయినా అలసట అనిపించదు. శరీరం తేలిపోయినట్టు ఉంటుంది. అటుపై వరుసగా రెండు రోజులు పగలు రాత్రి నిద్ర పోతాడు. 
 
తీరా నిద్ర‌లేచాక తప్పు చేశాను అనే భావన కలుగుతుంది. ఇక మీదట ఎప్పుడు చెయ్యను అనుకొంటాడు. కనీసం రెండు నెలలు ఆ ఆలోచన రానివ్వడు. ఈ స్థితిలో ఉన్న వాడిని డ్రగ్స్ ఇచ్చిన ఆ ఫ్రెండ్ కూడా డిస్టర్బ్ చెయ్యడు. నీ ఇష్టం అంటాడు. రెండు మూడు నెలలు డ్రగ్స్ తీసుకోకపోయేటప్పటికి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. తాను అడిక్ట్ కాను. తనకు ఆ కంట్రోల్ ఉంటుంది అనుకొంటాడు. ఈసారి తానే ఆ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి ఇంకోసారి ట్రై చేద్దాము అంటాడు. "వద్దు బాబు నీతో కష్టం" అంటాడు వాడు. కావాల‌నే వాడు బతిమాలాడించుకొంటాడు. ఇవన్నీసీనియర్‌కు డ్రగ్ కార్టెల్ ఇచ్చే ట్రైనింగులో భాగం. 
 
ఇక చివ‌రికి సీనియ‌ర్ ద‌య‌తో జూనియర్ రెండోసారి డ్రగ్స్ ట్రై చేస్తాడు. ఈసారి కూడా అదే అనుభూతి. వారం గడిచింది. ఇంకోసారి స్వర్గం చూడాలి అనుకొంటాడు. ఈసారి వారానికే థర్డ్ టైం. అపుడు అతనికి బ్రెయిన్ వాషింగ్ సెషన్ జరుగుతుంది. ఇందులో సీనియర్లు క్లాసులు తీసుకొంటారు. డ్రగ్ తీసుకొనుంటే ఆరోగ్యం పాడవుతుంది అనేది తప్పు అని, హీరోలు, హీరోయిన్లు ఎంతో మంది తీసుకొంటుంటారు. డ్రగ్స్ వల్లే వారి సౌందర్యం పెరిగి అందరికీ ప్రీతి పాత్రం అవుతార‌ని, డ్రగ్స్ తీసుక్కొంటే కండలు వచ్చి మాచో మాన్‌గా మారొచ్చ‌ని అబ‌ద్దాలు నూరిపోస్తారు. అమ్మాయిలు హ్యాండ్సమ్ అంటూ వెంటబడ‌తార‌ని చెపుతారు. ఇక ఒక అడుగు ముందుకేసి, అసలు ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ డ్రగ్స్ వాడుతార‌ని, వారి చదువు పాడుకాలేదు సరి కదా మెమరీ పెరిగి బ్రెయిన్ షార్ప్ అయ్యి మరిన్ని మార్కులు సాధించారంటూ, ఎవ‌రివో పేర్లు చెప్పి, ఫోటోలు చూపుతారు.
 
అమ్మో! మా ఇంట్లో వాళ్లు ఊరుకోరు. చంపేస్తారు అని బాధితుడు చెపితే, దానికి మ‌రో ర‌కం క్లాస్. సరే పట్టుపడితే ఏమవుతుంది? అమ్మ ఏడుస్తుంది... ఏడవనీ, రెండు రోజులు ఏడ్చి ఊరుకొంటుంది. అంతకన్నా ఏమి చేస్తుంది? నాన్న కొట్టడానికి వస్తాడు. రెండు దెబ్బలు తిను .. అమ్మ సానుభూతి దక్కుతుంది. నాన్న కూడా తరువాత అయ్యో అనుకొంటాడు. తరువాత ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వెళతారు. వారు అదే సోది చెబుతారు. వారికి అది వృత్తి. ఆరోగ్యం దెబ్బతింటుంది అంటారు. ఆరోగ్యం దెబ్బతింటే మరి హీరో హీరోయిన్లు ఎందుకు తీసుకొంటారు? కెరీర్ పాడైతే మీ సీనియర్ రెగ్యులర్‌గా హైలో ఉండేవాడు, ఇప్పుడు చూడు, ఫలానా కంపెనీలో ఇంత పెద్ద ప్యాకేజీకి పని చేస్తున్నాడు అంటూ.. ఇలా బ్రెయిన్ వాష్ జరిగిపోతుంది. 
 
రెండో దశలో డ్రగ్స్‌ను వారాంతాల్లో తీసుకోవడం మొదలు పెడ‌తాడు. ముందుగా ఫ్రీగా దొరికిన డ్రగ్‌కు ఇప్పుడు డబ్బులు చెల్లించాలి. పాకెట్ మనీ సరిపోవడం లేదు... అని అబద్దాలు ఆడటం, చిన్న వస్తువులు అమ్మేయడం, ఎల‌క్ట్రానిక గాడ్జెట్లు అమ్మేయ‌డం, ఇంట్లో చిన్నచిన్న‌ దొంగతనాలు... ఇలా ఒక్కో మెట్టు దిగ‌జారుడు ప్రస్థానం సాగుతుంది. 
 
అప్పుడు ఇక డ్ర‌గ్స్ కొనుక్కోడానికి... స్వయం ఉపాధి పథకం కింద డ్ర‌గ్స్ అమ్మ‌కాలు మొద‌లుపెడ‌తాడు. మరో నలుగురు కొత్త కుర్రాళ్లను ఊబిలోకి లాగాలి. ఒక్కడిని తెచ్చినప్పుడు ఒక్కో డోస్ ఫ్రీ... సీనియారిటీ వస్తే, ఇక కొత్తగా చీకటి ప్రపంచంలో వస్తున్నవారికీ బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమం చెయ్యాలి. తనని ఊబిలోకి దించిన వాడు ఇదే ప్రోగ్రాం ప్రకారం చేసాడు. ఫ్రెండ్షిప్ లేదు, పాడు లేదు అని అర్థం అవుతుంది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది... అతని అడుగుజాడల్లో తానూ నడుస్తున్నాడు. నలుగురు బకరాల కోసం వేట. ఇదే ఛైన్ లింక్డ్ డ్రగ్స్ ప్రమోషన్ టీం దుశ్చ‌ర్య‌లు. 
 
డ్రగ్స్ తీసుకొంటే దెబ్బ తినేది కేవలం వ్యక్తి ఆరోగ్యమే కాదు. కుటుంబం, నగరం, సమాజం, దేశం, ప్రజాస్వామ్య  వ్వవస్థ... ఒక‌టేమిటి? మొత్తం నాశనం అయిపోతాయి. డ్రగ్స్ రాజ్యం ఏలుతున్న మెక్సికో కొలంబియా లాంటి దేశాల్లో డ్రగ్స్ కార్టెల్స్ సమాంతర ప్రభుత్వాలు నడుపుతున్నాయి. హత్యలు, కిడ్నప్ లు, ఎక్ట్సార్ష‌న్ అక్క‌డ‌ నిత్యకృత్యం అయిపోయాయి. హింస అనేది నిత్య జీవన  విధానం అయిపోయింది అక్క‌డ‌. క్షేమంగా బతకాలి అంటే, మ‌న‌లా ప్ర‌భుత్వాన్ని, పోలీసు వ్య‌వ‌స్థ‌ను న‌మ్ముకుంటే చాల‌దు. డ్రగ్స్  మాఫియాకు పన్ను కట్టాల్సిన దుస్థితి ఆయా దేశాల‌లో ఉంది. డ్రగ్స్ కార్టెల్స్ బిలియన్ డాలర్ల‌ సంపదను కూడా బెట్టి, ప్రపంచంలోని ప్రభుత్వాలను ఆడించే సాహ‌సం చేస్తున్నాయి.  
 
డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి విష‌యంలో ఇండియా ఇంకా తొలిదశలోనే ఉంది. దేశంలో ఒక పక్క నిరుద్యోగిత, మ‌రో ప‌క్క తాగడం నాగ‌రిక‌త అనే స్థాయికి ఎపుడూ చేర‌కూడ‌దు. ప‌లు నగరాల్లో ఇప్పటికే వ్యవస్తీకృతం అవుతున్న డ్రగ్స్ మాఫియాను కూక‌టి వేళ్ళ‌తో పెక‌లించి వేయాలి. దేశ జనాభాలో డెబ్భై అయిదు శాతం ఉన్న యువ‌త‌ను మ‌నం కాపాడుకోవాలి.