శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (10:39 IST)

ఎట్టకేలకు తితిదే ఒక మంచి పనిచేస్తోంది... అదేమిటి...?

తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కటి విమర్శలు తావిచ్చినా కొన్ని మాత్రం భక్తులతో పాటు నిరుపేద రోగులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. అందులో తిరుపతి బర్డ్ ఆసుపత్రి ఒకటి.

తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కటి విమర్శలు తావిచ్చినా కొన్ని మాత్రం భక్తులతో పాటు నిరుపేద రోగులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. అందులో తిరుపతి బర్డ్ ఆసుపత్రి ఒకటి. బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స, పునరావాస కేంద్రం (బర్డ్) ఈ పేరు వినగానే ఎవరికైనా కళ్ళముందు కదలాడేది. పోలియో మహమ్మారి బారిన పడిన అభాగ్యులు ఊత కర్రలతో మెల్లమెల్లగా అడుగులు వేస్తున్న దృశ్యం. అలాంటి వారికి బుడిబుడి అడుగుల దశ నుంచే ఎందరికో నడకలు నేర్పిన బర్డ్ ఇప్పుడు ఛాంపియన్‌లా పరుగులు తీస్తోంది. ఎముకల వైద్యానికి ఆసియాలోనే కేరాఫ్‌ అడ్రస్‌గా మారబోతోంది. 
 
శ్రీవారి కరుణాకటాక్షాలతో భారీగా విస్తరిస్తున్న బర్డ్ తన సేవలనూ అంతకంత విస్తృతం చేయబోతోంది. 40 కోట్ల రూపాయల అధునాతన పరికరాలు, ఆపరేషన్‌ థియేటర్లు, భవంతి సిద్ధం చేసుకుని ప్రారంభానికి రెడీ అవుతోంది. పోలియో బారిన పడి నడవలేని వారికి శస్త్ర చికిత్సలు తదితర వైద్యసేవలు అందించడం కోసం తిరుపతిలో ఏర్పాటైన బర్డ్ ఇప్పటికే దేశ వ్యాప్తంగగా ప్రతిష్టను సంపాదించుకుంది. 
 
దేశ నలుమూలల నుంచి వైద్యం కోసం బర్డ్ కు వస్తున్నారు. బర్డ్ డాక్టర్లే దేశమంతా తిరిగి వైద్య శిబిరాలు నిర్వహించి శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే బర్డ్ వేలాదిమందికి చికిత్సలు చేసినప్పటికీ అవసరాల మేరకు విస్తరించలేదు. చాలా యేళ్ళు అలాగే ఉండిపోయింది. దీంతో బర్డ్‌లో శస్త్ర చికిత్స చేయించుకోవాలంటే సంవత్సరాల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఆసుపత్రికి వెళ్ళి చూపించుకుంటే ఆపరేషన్‌ చేయాలని వైద్యులు నిర్ణయిస్తే ఆ వ్యక్తికి మరో నాలుగేళ్ళ దాకా ఆపరేషన్‌ చేయడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే 2020 సంవత్సరం దాకా  ఆపరేషన్లకు థియేటర్లు ఫుల్‌ అయ్యాయయన్నమాట. ఇదే బర్డ్‌పై తీవ్ర అసంతృప్తి కలిగించేది. 
 
ప్రస్తుతం బర్డ్‌లో ఏడు ఆపరేషన్‌ థియేటర్లు, 350 పడకలు ఉన్నాయి. ఇవి ఏ మాత్రం చాలడం లేదు. అవుట్‌ పేషెంట్‌ విభాగంలోనూ సదుపాయాలు లేవు. ఒకప్పుడు రోజుకు 400 మించని అవుట్‌ పేషెంట్‌లు ఇప్పుడు వెయ్యిమందికి మించుతున్నారు. ఓపిలో కూర్చోవడానికి కూడా స్థలం ఉండదు. ఓపి కోసం తెల్లవారుజామున 3 గంటల నుంచే నిరీక్షించాల్సిన దుస్థితి. మోకాలు మార్పిడి, తుంటెమార్పిడి, సెరిబ్రల్‌ పాల్సీ వంటి శస్త్ర చికిత్సలు చేయగల వైద్య నిపుణులున్నా ఆపరేషన్‌ థియేటర్ల కొరత, ప్రమాదంలో ఎముకలు విరిగిన వారిని చేర్చుకుని చికిత్స అందించలేని పరిమితి.
 
పోలియో వ్యాధిగ్రస్తులకు త్వరగా శస్త్ర చికిత్సలు అందించాలన్నా, వృద్ధులకు మోకాళ్ళ మార్పిడి వంటి వైద్యసేవలు చేయాలన్నా, ప్రమాదాల్లో గాయపడిన వారికి ఊరట కలిగించాలన్నా బర్డ్‌ను భారీగా విస్తరించడమే పరిష్కామని గుర్తించిన తితిదే ఆ దిశగా అడుగులు వేసింది. బర్డ్ పక్కనే మరో భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 4 అంతస్తులుగా ఉన్న ఈ భవంతిలో మొత్తం 8 ఆపరేషన్‌ థియేటర్లు అందుబాటులో రానున్నాయి. మూడో అంతస్తులో ఏడు థియేటర్లు పక్కపక్కనే ఉంటాయి. కింది అంతస్తులో అత్యవసర కేసులకు (ప్రమాదాల్లో గాయపడిన వారి కోసం ) ప్రత్యేకంగా ఆపరేషన్‌ థియేటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఓటీలో అత్యాధునిక వైద్య పరికరాలతో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్నాయి. 
 
వైద్య పరికరాల కోసమే రూ.8 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నారు. ఇక భవన నిర్మాణం, ఎలక్ట్రికల్‌ పనులకు రూ.32 కోట్లు వెచ్చిస్తున్నారు. మొదటి అంతస్తులో ఏర్పాటైవున్న ఓపి కేంద్రంలో వెయ్యి మందికిపైగా వేచి ఉండటానికి వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండో అంతస్తులో ఉన్న ఆపరేషన్‌ థియేటర్ల వద్ద కూడా దాదాపు వెయ్యిమంది నిరీక్షించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కింది అంతస్తులో ఎక్స్‌రే, వైద్య పరీక్షలకు అవసరమైన ల్యాబ్‌లు నిర్మితమవుతున్నాయి. ఈ భవంతిలో 50 పడకలతో ఐసియూ కూడా అందుబాటులోకి వస్తుంది.
 
ప్రస్తుతమున్న ఏడు ఆపరేషన్‌ థియేటర్లలో రోజుకు 20 మందికి మాత్రమే శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ప్రస్తుతమున్న 7, కొత్తగా ఏర్పాటు చేసే 8 థియేటర్లు కలిపి మొత్తం 15 ఓటీల్లో రోజుకు 50 మందికి శస్త్ర చికిత్సలు చేయడానికి వీలవుతుంది. దీనివల్ల శస్త్ర చికిత్సల కోసం 2020 సంవత్సరం దాకా ఉన్న వెయిటింగ్‌ లిస్టును 2017 చివరి నాటికే పూర్తి చేయడానికి సాధ్యమవుతుంది. కొత్తగా వైద్యులను, సిబ్బందిని కూడా నియమించాల్సి ఉంటుంది. మరో ఐదారుగురు ఆర్థో వైద్యులు, ముగ్గురు నలుగురు మత్తు డాక్టర్లు అవసరమవుతారు. తరచూ విదేశాల నుంచి ఎముకల వైద్య నిపుణులను పిలిపించి చికిత్సలు అందించడానికీ ప్రణాళికలూ సిద్ధం చేస్తున్నారు. బర్డ్‌ను ఇంత భారీ స్థాయిలో విస్తరించడం ఇదే తొలిసారి. విస్తరణ పూర్తయితే ఆసియాలోనే ప్రముఖ ఎముకల ఆసుపత్రి కీర్తిని సొంతం చేసుకోనుంది. 
 
తిరుపతిని మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆలోచనలో భాగంగానే బర్డ్‌ను తితిదే విస్తరిస్తోంది. ఇదే తరహాలో స్విమ్స్‌నూ విస్తరించడానికి ప్రణాళికలూ రూపొందిస్తున్నారు. 750 పడకలున్న స్విమ్స్‌ను 1750 పడకలకు పెంచాలని మొన్న విజయవాడలో జరిగిన స్విమ్స్‌ గవర్నింగ్‌ బాడీ సమావేశంలో నిర్వహించారు. నేత్రవైద్యం కోసం శంకర నేత్రాల ఆసుప్రతి తిరుపతిలో ఏర్పాటు కానుంది. బర్డ్ నూతన భవనాన్ని సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.