శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 డిశెంబరు 2019 (15:11 IST)

చిరంజీవి ప్రకటన వెనుక వారున్నారా….?? వ్యక్తిగత స్వార్థానికేనా?

మాజీ కేంద్రమంత్రి, నటుడు చిరంజీవి మూడు రాజధానుల ప్రకటనకు మద్దతు పలకటం వెనుక మరో సినీ హీరో అక్కినేని నాగార్జునతో పాటు మంత్రులు అవంతి శ్రీనివాస్‌, కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గంటాశ్రీనివాసరావులు ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వారందరూ సినీ పరిశ్రమ హైదరాబాదుకే పరిమితం అయిందని, విశాఖ రాజధాని అయితే సినీ పరిశ్రమ అభివృద్ది చెందే అవకాశాలున్నాయని, విశాఖ నగరం చుట్టు పక్కల ప్రాంతాలలో మీకు భూములున్నాయి, ఆ భూములలో ఫిిలింసిటీ నిర్మించుకోవచ్చని, దాని వలన మీకు ఆర్థిక లాభం చేకూరుతుందని వారు చెప్పినట్లు సమాచారం. 
 
ఒకవైపు ఎన్నికలలో ఓడిపోయినా జనంలోకి వెళుతున్న జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకువాల్సిన చిరంజీవి తన వ్యక్తిగత స్వార్థం, ఆర్థిక లబ్డి కోసమే.. మద్దతిచ్చినట్లు ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవితో మొదటి నుండి సన్నిహితంగా మెలిగే సినీ హీరో అక్కినేని నాగార్జున, వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావులు ఆయనకు ఎన్నో విధాలుగా నచ్చచెప్పి ఒప్పించినట్లుగా ప్రచారం జరుగుతోంది. రాజకీయాలకు దూరంగా ఉంటూ, సినిమాలలో నటిస్తూ కాలం గడుపుతున్న చిరంజీవి గత ఐదేళ్లలో మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుని హోదాలో కేంద్రాన్ని ఎలాంటి డిమాండ్‌ చేయలేదు. పార్లమెంటులో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎన్నడూ కోరలేదు.
 
తాజాగా తన ఆస్తుల విలువ పెంచుకునేందుకు, ఆర్థికంగా లబ్ది పొందేందుకు అత్యుత్సాహం చూపిస్తున్నారు. వందల కోట్లు ఆస్తులున్నాయి. సినీ పరిశ్రమలో ఏక చక్రాధిపత్యంగా శాసిస్తున్నారు. కుమారుడు సినీ హీరోగా వెలుగుతున్నారు. ఆయనకు ఇంకా ఏమి కావాలి..? ఉన్న ఆస్తులు చాలవా.? విశాఖలో భూములు విలువ పెరిగినా ఫిలిం సిటీ నిర్మిస్తే అదనపు ఆర్థిక లబ్ది చేకూరుతుందని అత్యాశ పడ్డారా…? ఏది ఏమైనా ఈ విషయంలో చిరంజీవి తప్పటడుగు వేశారని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఒకవైపు పవన్‌ కళ్యాణ్‌ను బీజేపిలో చేర్చుకుని ఆయనకు రాజకీయంగా పెద్ద పీట వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అమరావతిలోనే రాజధాని కొనసాగాలని చిరంజీవి మరో సోదరుడు, జనసేన పార్టీ ముఖ్యనేత నాగబాబు బాహాటంగానే డిమాండ్‌ చేశారు. సోదరులిద్దరు రాజకీయంగా జగన్‌ ప్రభుత్వంపై పోరాడుతుంటే మూడు రాజధానులకు చిరంజీవి మద్దతు పలకటం ఆయన అభిమానులను ఒకింత నిరాశకు గురి చేసింది.