1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2015 (18:14 IST)

చిరంజీవికి రాహుల్ చీవాట్లు... పాలిటిక్స్‌కు మెగాస్టార్ టాటా.. సినిమాలపైనే శ్రద్ధ?

ప్రస్తుతం కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మెగాస్టార్ చిరంజీవికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చీవాట్లు పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 150వ చిత్రంపై పెట్టిన శ్రద్ధను సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతపై పెట్టాలని సూచించారు. దీనికి చిరంజీవి వైపు నుంచి సరైన స్పందన లేకపోవడంతో రాహుల్ ఒకింత అసహనంతో పాటు.. ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు సమాచారం. 
 
రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోగా.. తెలంగాణ రాష్ట్రంలో అంతమాంత్రంగానే ఉంది. అయితే, తెలంగాణ కంటే ఏపీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. విభజన తర్వాత ఏపీ పీసీసీ చీఫ్‌గా ఉన్న ఎన్. రఘువీరారెడ్డి... కాలికి బలపం కట్టుకుని 13 జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. 
 
దీనికి కారణం లేకపోలేదు. ఇప్పటికే అనేక మంది సీనియర్ నేతలు పార్టీని వీడారు. మిగిలిన నేతలు నామమాత్రంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మంచి చరిష్మా కలిగిన చిరంజీవి వంటి నేతలు ఆ మధ్య అనంతపురంలో రాహుల్ నిర్వహించిన రైతు పాదయాత్రలో తళుక్కుమన్నారు. ఆ తర్వాత వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 
 
ఏదో పేరుకి కాంగ్రెస్ నాయకుడని అనిపించుకుంటున్నా ఆ దరిదాపులకే వెళ్లడం లేదు. పైగా ఆయన దృష్టంతా 150వ సినిమాపైనే ఉంది. పొలిటికల్ ఎపిసోడ్‌కి దాదాపు గుడ్‌బై చెప్పేసినట్లేనని అంటున్నారు. రాహుల్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని, ఆ విషయాన్ని చిరంజీవితో డైరెక్ట్‌గా చెప్పి చీవాట్లు కూడా పెట్టారంటున్నారు. 
 
చిరంజీవి తన 150వ సినిమాపై పెడుతున్న శ్రద్ధ... పార్టీ బలోపేతంపై పెట్టుంటే... ఏపీలో కొంచెమైనా కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడి ఉండేదని రాహుల్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. రాహుల్ వ్యాఖ్యలతో నొచ్చుకున్న చిరంజీవి... టోటల్‌గా పొలిటికల్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పేయాలని నిర్ణయించుకున్నట్టు వినికిడి. ముఖ్యంగా తన రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత ఆయన రాజకీయాలకు స్వస్తిచెప్పి.. పూర్తిగా సినిమాలవైపే దృష్టికేంద్రీకరించాలన్న భావనలో ఉన్నట్టు తెలుస్తోంది.