శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : బుధవారం, 4 జనవరి 2017 (11:36 IST)

అన్నాడీఎంకేలో చీలిక... జయలలిత మేనకోడలు దీపకు మద్దతు...?

తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ అన్నాడీఎంకేలో చీలిక అనివార్యమయ్యేలా కనిపిస్తోంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ బాధ్యతలు స్వీకరించడాన్ని కొందరు నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. మంత్రి ప

తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ అన్నాడీఎంకేలో చీలిక అనివార్యమయ్యేలా కనిపిస్తోంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ బాధ్యతలు స్వీకరించడాన్ని కొందరు నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. మంత్రి పదవులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే తమ స్థానాలను కాపాడుకునేందుకు శశికళకు జై కొడుతున్నారన్నది బహిరంగ రహస్యం. 
 
కానీ, జయలలిత మరణం తర్వాత గుంభనంగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలు శశికళను లోలోపల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికితోడు ఆ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు, కింది స్థాయి కార్యకర్తలు శశికళ రాకను బహిరంగంగానే వ్యతిరేకిస్తూ ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ నిశితంగా గమనించిన కొందరు నేతలు... జయలలిత మేనకోడలు దీపాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించేందుకు తగిన ప్రయత్నాలు వేగవంతం చేశారు. 
 
దీనికి కారణం మేనత్త జయలలితను తలపించే రీతిలో దీప వ్యాఖ్యలు, హావాభావాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక, మీడియాతో ఆమె స్పందించే తీరులో జయలలిత పోలికలు కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయని చెప్పవచ్చు. మేనత్త వారసురాలు తానేనని, రాజకీయాల్లో వస్తానని ఇప్పటికే దీపా స్పందించారు.
 
దీంతో అన్నాడీఎంకే అసంతప్తి నాయకులు, ద్వితీయ, తృతీయ శ్రేణి కేడర్‌ స్థానిక త్యాగరాయ నగర్‌లోని శివజ్ఞానం వీధిలో ఉన్న దీపా ఇంటి వద్దకు పోటెత్తుతున్నారు. తన కోసం వస్తున్న వాళ్లను ఆప్యాయంగా నమస్కరిస్తూ దీపా పలకరించి ఓపిక పట్టాలని సూచిస్తున్నారు. పైగా, వారి వివరాలను కూడా సేకరిస్తుండటం గమనార్హం.