పవన్ ప్రకటన కరెక్టేనా? ఎపిలో ప్రస్తుత జనసేన పరిస్థితి తెలిస్తే..

pawan  kalyan
జె| Last Modified శనివారం, 5 జనవరి 2019 (20:23 IST)
ఎపిలోని అన్ని స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్‌ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటివరకు జనసేన పార్టీకి కొన్ని జి0ల్లాల్లో క్యాడరే లేకున్నా పవన్ కళ్యాణ్‌ అభ్యర్థులను ఎలా నిలబెడతారన్నది ఆసక్తికరంగా మారుతోంది. పవన్ కళ్యాణ్‌ ఉన్నట్లుండి ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది?

సినీ రంగంలో ఒక వెలుగు వెలిగిన నటుడు పవన్ కళ్యాణ్‌. ప్రజా సేవ కోసం జనసేన పార్టీని స్థాపించారు. తెలంగాణా ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించినా రాష్ట్రంలో మాత్రం పవన్ కళ్యాణ్‌ పోటీ చేయలేదు. కానీ ఎపిలోని 13 జిల్లాల్లో ఉన్న 175 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయంగా చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా 13 జిల్లాలలో కన్నా చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కారణం పవన్ కళ్యాణ్‌ అన్న చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడమే. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది చివరకు ఆ పదవికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యులుగా నియమితులై వెళ్ళిపోయారు.

తిరుపతిలో కాపు సామాజికవర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వీరి ఓట్లే ప్రతి ఎన్నికల్లోను కీలకంగా మారుతుంది. చిరంజీవి అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఈజీగా గెలిచిపోయారు. అంతేకాదు అదే సామాజికవర్గానికి చెందిన వారికి సీటిస్తే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అయితే ఈసారి ఎన్నికలు మాత్రం చాలా రసవత్తరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఎన్నికల్లో టిడిపి, వైఎస్ఆర్సిపిల మధ్య పోటీ ఉంటే ఈ ఎన్నికల్లో జనసేన కూడా తోడైంది. అందులోను కాపు సామాజికవర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు ఆచితూచి అభ్యర్థులను ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చేశాయి.

తిరుపతిలో కాపు సామాజికవర్గం 45 శాతం మందికిపైగా ఉన్నారు. అలాగే చిత్తూరులో 20 శాతంకు పైగా అదే సామాజికవర్గానికి చెందినవారు ఉన్నారు. అలాగే శ్రీకాళహస్తిలోను కాపు సామాజికవర్గానికి చెందిన వారు 15శాతం ప్రజలు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాలు ఉండగా కేవలం మూడు నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన ప్రభావం ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల భావన. అంతేకాదు ఉన్న మూడు నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో జనసేన పార్టీకి క్యాడర్ కూడా లేకపోవడం ఆ పార్టీకి ఉన్న మైనస్ అంటున్నారు విశ్లేషకులు. ఉన్న నాయకులు ప్రజల్లోకి వెళ్ళకపోవడం, ఎవరి సొంత పనుల్లో వారు ఉండిపోవడం, జనసేన పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు పర్యటన ఉంటే మాత్రమే తళుక్కున మెరిసి ఆ తరువాత కనిపించడం లేదు. స్వయంగా పవన్ కళ్యాణ్‌ హైదరాబాద్ వేదికగా చిత్తూరు జిల్లాకు చెందిన నేతలందరినీ పిలిచి దిశానిర్దేశం చేసినా వారిలో ఏ మాత్రం మార్పు కనిపించలేదు.

మొదట్లో ఒక పార్టీకి చెందిన నేతలను తీసుకోనని చెప్పిన పవన్ కళ్యాణ్‌ ఆ తరువాత మెల్లమెల్లగా కొంతమంది నేతలను తీసుకుంటున్నారు. అందులో చదలవాడ క్రిష్ణమూర్తి ఒకరు. టిటిడి మాజీ ఛైర్మన్‌గా, కాంగ్రెస్, టిడిపి పార్టీలలో సీనియర్ నేతగా ఉన్న చదలవాడక్రిష్ణమూర్తి ప్రస్తుతం జనసేన పార్టీకి పెద్ద దిక్కు. ఈయనొక్కరే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ నేతల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి. తిరుపతి నుంచి ఈసారి జరిగే ఎన్నికల్లో చదలవాడ క్రిష్ణమూర్తితో పాటు పవన్ కళ్యాణ్‌‌కు అత్యంత సన్నిహితుడు పసుపులేటి హరిప్రసాద్‌లలో ఎవరికో ఒకరికి సీటు దక్కే అవకాశం కనిపిస్తోంది.

ఇక మిగిలిన నేతలంతా ద్విత్రీయ శ్రేణి నేతలే. మిగిలిన రెండు నియోజకవర్గాలు చిత్తూరు, శ్రీకాళహస్తిలలో అసలు జనసేనపార్టీకి నేతలే లేరు. అభ్యర్థులు కావాలంటే కొత్తగా నేతను ఎంచుకోవాల్సిందే. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలాగే వుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జనసేనాని అభ్యర్థులను ఎప్పటిలోగా ఎంచుకుంటారు..ప్రధాన ఎన్నికల్లో ఏవిధంగా ముందుకు వెళతారన్న విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.దీనిపై మరింత చదవండి :