శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By శ్రీ
Last Modified: గురువారం, 9 జనవరి 2020 (14:57 IST)

రాములమ్మ రాజకీయాలకు స్వస్తి చెప్పినట్టేనా?

లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి రాజకీయాలకు ప్యాకప్ చెప్పాలని ఆలోచిస్తున్నారా? పూర్తి సమయం సినిమాలకే కేటాయించాలనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం రాబోతుంది. ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్‌గా కాంగ్రెస్ పార్టీ  తరపున తెలంగాణ అంతటా ప్రచారం చేసినా, కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అడపాదడపా ప్రకటనలు విడుదల చేయడం తప్ప పెద్దగా క్రీయాశీల రాజకీయాల్లో కనిపించడంలేదు.
 
అదే సమయంలో సినిమాలో సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో కీలకమైన రోల్ షోపించారు. అంతేకాదు  మరికొన్ని సినిమాలకు సైతం విజయశాంతి సైన్ చేశారన్న వార్తలే రాములమ్మ రాజకీయాలకు స్వస్తి చెప్పినట్టుగా కనపడుతుందన్న భావనను వ్యక్తం చేస్తున్నాయి పొలిటికల్ వర్గాలు. 
 
విజయశాంతి పొలిటికల్ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. భారతీయ జనతా పార్టీ ఫైర్‌ బ్రాండ్‌‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి  కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. ఆ తరువాత మెదక్  పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొంది లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ తరువాత కేసీఆర్‌తో వచ్చిన మనస్పర్ధలు కారణంగా టీఆర్ఎస్‌కు సైతం గుడ్‌ బై చెప్పి, కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇప్పుడామె కాంగ్రెస్‌లోనే ఉన్నా, క్రియాశీలకంగా మాత్రం లేరు. 
 
కాంగ్రెస్‌లో సీనియర్లు తనను పొమ్మనలేక పొగపెడుతున్నారని అసంతృప్తిగా ఉన్న రాములమ్మను సొంతపార్టీ గూటికి తీసుకురావడానికి బిజేపి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ ఈ ప్రచారాన్ని విజయశాంతి చాలాసార్లు ఖండించారు. అయితే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి, ఆమె సినిమాలను ఒప్పుకున్నారని, త్వరలో మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకం అవుతారని  పొన్నం ప్రభాకర్ లాంటి నేతలు అంటున్నా, విజయశాంతి మనస్తత్వం తెలిసిన నేతలు ఆమె రాజకీయాల్లో ఇమడలేరని అందుకే మరలా సినిమాలు వైపు వస్తున్నారని అంటున్నారు.