శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: మంగళవారం, 16 డిశెంబరు 2014 (12:34 IST)

జంపింగ్ జపాంగ్ లకు మంత్రులు... టి.లో తెదేపా సమాధికి కేసీఆర్ ప్లాన్...

కేసీఆర్ టార్గెట్ సూటిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ మీద ఉన్నట్లు స్పష్టంగా కనబడుతోంది. నిన్నగాక మొన్న పార్టీలోకి జంపింగ్ జపాంగ్ లుగా తెలుగుదేశం పార్టీ నుంచి దూకిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావులకు మంత్రి పదవులను కట్టబెట్టడంతో మిగిలిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఫిక్సులో పడేశారు. వారిలో చాలామందికి ఇప్పటికే మంత్రి పదవుల కోసం పిలుపులు వచ్చాయని కూడా ఆమధ్య వార్తలు వచ్చాయి. 
 
తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినవారికి వెంటనే మంత్రి పదవులు కట్టబెట్టిన కేసీఆర్, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలో చేరి పోటీ చేసి గెలిచిన కొండా సురేఖను మాత్రం పట్టించుకోలేదు. దీన్నిబట్టి ఆయన టార్గెట్ తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పకతప్పదు. ఎందుకంటే మొన్నామధ్య అసెంబ్లీ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ ను పెద్దగా కార్నర్ చేసిన సందర్భం పెద్దగా కనిపించలేదు. 
 
సభలో తెరాసకు కొరకరాని కొయ్యగా కేవలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే నిలిచారు. దీంతో కేసీఆర్ టార్గెట్ వారిపైకి మళ్లినట్లు చెపుతున్నారు. వచ్చే ఎన్నికల లోపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఖాళీ చేసేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేందుకు ఎంతమాత్రం వెనుకాడరనే చర్చ నడుస్తోంది. 
 
ఇందులో భాగంగానే తెలంగాణ కేబినెట్‌లోకి ఆరుగురు కొత్త మంత్రులను మంగళవారం ఉదయం 11 గంటలకు కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయించారన్న కామెంట్లు వినబడుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, లక్ష్మారెడ్డి, చందూలాల్, ఇంద్రకరణ్ రెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలీ, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.