తెలంగాణలో భాజపాకి ఊపిరులూదిన కేసీఆర్, ఇక నాగార్జున సాగర్ భయం...

KCR
ఐవీఆర్| Last Modified శుక్రవారం, 4 డిశెంబరు 2020 (20:20 IST)
రాష్ట్ర విభజన తర్వాత తెరాసకి ప్రధాన ప్రత్యర్థిగా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిగిలింది. తెలుగుదేశం, భాజపా వున్నప్పటికీ అవి నామమాత్రపు సీట్లతో సర్దుకుంటూ వచ్చాయి. 2016 ఎన్నికల తర్వాత అసలు తెదేపా, కాంగ్రెస్ పార్టీలను దాదాపు భూస్థాపితం చేసేశారు చీఫ్ కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు ఎవరైనా వచ్చినవారిని వచ్చినట్లు పార్టీలో చేర్చుకున్నారు. ఇక్కడే ఆయన పప్పులో కాలేశారని అంటున్నారు విశ్లేషకులు.

ప్రతిపక్ష పార్టీని లేకుండా చేయడం మూలంగా ప్రజలు తమ అసంతృప్తిని మరో పార్టీ ద్వారా తెలియజేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుసగా భాజపాకు వస్తున్న విజయాలకు అదే కారణం. మొన్న దుబ్బాకలో షాకిచ్చిన భాజపా తాజాగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏకంగా అధికార తెరాసకి సవాల్ విసిరింది. దాదాపు తెరాసకి వణుకు పుట్టించింది.

కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోవడం, తెదేపా నామరూపాల్లేకుండా పోవడంతో తెరాస ప్రధాన ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీ అవతరించింది. ఇదే ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికల్లో స్పష్టంగా కనబడుతోంది. మరోవైపు వైసిపి చీఫ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో కేసీఆర్ దోస్తీ కారణంగా తెలంగాణలోని తెదేపా మద్దతుదార్లు భాజపా వైపు మళ్లినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఎంఐఎం పార్టీతో బలమైన స్నేహాన్ని కొనసాగిస్తుండటంతో హిందువుల ఓటు బ్యాంక్ కొద్దోగొప్పో భాజపా వైపు దృష్టి సారించడం వల్ల జిహెచ్ఎంసిలో ఆ ప్రభావం కనబడిందంటున్నారు.
Jagan-KCR
ఇక తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా తెరాసకి ప్రధాన ప్రత్యర్థిగా భాజపా అనడంలో సందేహంలేదు. త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగబోతోంది. ఇటీవలే నోముల నర్సింహయ్య మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి వుంది. నిజానికి అక్కడ భాజపాకి పట్టు లేదు. కానీ ఇప్పటికే అక్కడ ఆ పార్టీ పావులు కదుపుతున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీలోని నాయకులు చాలామంది నైరాశ్యంతో వున్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీమంత్రి జానారెడ్డిని కాంగ్రెస్ పార్టీతో లాభం లేదని ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు భోగట్టా. జానాకు నియోజకవర్గంలో మంచి పట్టు వుంది. గత ఎన్నికల్లో ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి బరిలోకి దిగుతారన్న ప్రచారం జరిగింది. కానీ జానారెడ్డి పోటీ చేసి నోముల నర్శింహయ్య చేతిలో పరాజయం చవిచూసారు. ఇప్పుడు జానారెడ్డి కుమారుడితో భాజపా మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో జానాకి కూడా ప్రత్యామ్నాయం భాజపా తప్ప మరో పార్టీ లేదు.

జానారెడ్డి భాజపా తీర్థం పుచ్చుకుంటే ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనూ తెరాసకి పెద్ద సవాలే. మరి ఇంతింతై వటుడింతై అన్న చందంగా ప్రత్యర్థి బలపడుతుంటే తెరాస చీఫ్ ఎలాంటి ఎత్తులతో చిత్తు చేస్తారన్నది వేచి చూడాల్సిందే.దీనిపై మరింత చదవండి :