శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By jsk
Last Updated : బుధవారం, 11 మే 2016 (18:44 IST)

ముంచుకొస్తున్న కృష్ణా పుష్క‌రాలు .. అరకొరగా ఫ్లైఓవ‌ర్ ప‌నులు... బెజ‌వాడ‌ అధికారుల్లో టెన్ష‌న్

బెజ‌వాడ క‌న‌క దుర్గ‌మ్మ స‌న్నిధిలో మ‌రో ఉత్స‌వం స‌మీపిస్తోంది. ఆ ఉత్సవమే కృష్ణా పుష్క‌రాలు. ఆంధ్ర‌ప‌దేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్ప‌డిన త‌ర్వాత తొలిసారి జ‌రుగ‌నున్న ఈ పుష్క‌రాల‌కు ల‌క్ష‌ల్లో భ‌క్తులు వ‌స్తార‌ని అంచ‌నా. ఈ భక్తుల తాకిడిని త‌ట్టుకోవాలంటే, అత్య‌వ‌స‌రంగా దుర్గ‌గుడి వ‌ద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్త‌ి చేయాలి. స‌రిగ్గా పుష్క‌రాల‌కు మూడు నెల‌ల గ‌డువు ఉండ‌గా, ఇంకా ఫ్లై ఓవర్ నిర్మాణం ఓ కొలిక్కి రాలేదు. దీనితో పుష్క‌రాల‌కు ఫ్లై ఓవర్ సాధ్య‌మ‌య్యేట్లు క‌నిపించ‌డం లేదు.
 
న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ తాత్కాలిక రాజ‌ధాని విజ‌య‌వాడ... ఓ ట్రాఫిక్ ప‌ద్మ‌వ్యూహంగా మారిపోయింది. హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు రావ‌డం ఒక ఎత్తు. విజ‌య‌వాడ న‌గ‌ర శివారు నుంచి న‌గ‌రంలోకి రావ‌డం మ‌రో ఎత్తు. దుర్గ‌గుడి వ‌ద్ద ఇపుడు ఫ్ల‌యివోవ‌ర్ నిర్మాణ ప‌నులు చేస్తుండ‌టంతో, హైవేని దారి మ‌ళ్లించారు. ఇపుడు న‌గ‌రంలోకి ఏ వాహ‌నం రావాల‌న్నా... బైపాస్ రోడ్డులో విజ‌య‌వాడ వ‌న్ టౌన్ మీదుగా రావాల్సిందే. ఈ ట్రాఫిక్ క‌ష్టాల సంగ‌తి ఎలా ఉన్నా... తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలో దుర్గ‌గుడి ఫ్లైఓవ‌ర్ నిర్మాణం అవుతున్నందుకు బెజ‌వాడవాసులు సంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. 
 
కానీ, ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వ‌చ్చే కృష్ణా పుష్క‌రాల‌కు పూర్తి అవుతుందా అనే అనుమానాలు మాత్రం వ్య‌క్తమవుతున్నాయి. ఆగ‌స్టు 11 నుంచి కృష్ణా పుష్క‌రాలు ప్రారంభం కానున్నాయి. ఈ లోగా ఫ్లైఓవ‌ర్ ప‌నులు పూర్తి చేయాల‌ని అధికారులు హ‌డావుడి ప‌డుతున్నారు. దుర్గ‌గుడి ఫ్లైఓవ‌ర్ ప‌నుల‌ను రూ.333 కోట్ల‌తో చేప‌ట్టిన సోమా క‌న‌స్ట్ర‌క్స‌న్ కంపెనీపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్ప‌టికే తాము యుద్ధ ప్రాతిప‌దిక‌న ప‌నులు చేస్తున్నామ‌ని, కానీ భూసేక‌ర‌ణ‌, ఇరిగేష‌న్, విద్యుత్ అనుమ‌తులు రావ‌డంలో కొంత ఆల‌స్యం వ‌ల్ల ప‌నులు అనుకున్న‌ట్లు సాగ‌డం లేద‌ని చెపుతున్నారు. పుష్క‌రాల లోగా ఫ్లైఓవర్ సాధ్యం కాద‌ని చేతులెత్తేస్తున్నారు.
 
ఈ ఫ్లైఓవర్ ప్రాజెక్టును మొత్తం 447 కోట్ల రూపాయ‌ల‌తో చేప‌ట్టారు. ఇందులో 6 లైన్ల ఫ్లైఓవర్, దాని కింద 4 లైన్ల  రోడ్డు నిర్మాణాలున్నాయి. దుర్గ గుడి వ‌ద్ద 50 పిల్ల‌ర్ల‌తో ఫ్లైఓవర్... అందులో 12 పిల్ల‌ర్లు కృష్ణా న‌దిలోకి నిర్మిస్తున్నారు. ఇది పూర్త‌యితే త‌ప్పించి దుర్గ గుడి వ‌ద్ద పుష్క‌రాల ట్రాఫిక్ ర‌ద్దీని త‌ట్టుకోవ‌డం క‌ష్టం. కానీ, ఫ్లైఓవర్ ప‌నులు పుష్క‌రాల‌కు పూర్తి చేయ‌డం అసాధ్య‌మ‌ని, వ‌చ్చే ఆగ‌స్టు క‌ల్లా క‌నీసం 4 లైన్ల రోడ్డ‌యినా పూర్తి చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో అధికార యంత్రాంగం ఉంది. ఇప్ప‌టికే ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయ‌ని వాహ‌న‌దారులు గ‌గ్గోలు పెడుతున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం చేప‌ట్టిన 5 నెల‌ల‌కే చాలా ప్ర‌గతిని క‌న‌బ‌రిచిన అధికార యంత్రాంగం, పుష్క‌రాల లోగా ట్రాఫిక్ ఇబ్బందుల‌ను క్లియ‌ర్ చేయాల‌ని స్థానికులు కోరుతున్నారు.