శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: సోమవారం, 19 సెప్టెంబరు 2016 (09:52 IST)

తెలంగాణాలో కేటీఆర్... ఆంధ్ర‌లో లోకేష్... ఇద్ద‌రూ ఐటీనే!

విజ‌య‌వాడ‌ : ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లెందుకు... ఇద్ద‌రం సీఎంలే... ఇద్ద‌రికి ఎదిగొచ్చిన కొడుకులున్నారు... వాళ్ల భ‌విష్యత్తు ముఖ్యం అని... బెజ‌వాడ‌లో నేను... హైద‌రాబాదులో మీరు ... ఇక ఏ క‌క్ష సాధింపులు వ‌ద్ద‌ని... చంద్ర‌బాబు, కేసీఆర్ ఒక అంగీకారానికి వ‌చ్చార

విజ‌య‌వాడ‌ : ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లెందుకు... ఇద్ద‌రం సీఎంలే... ఇద్ద‌రికి ఎదిగొచ్చిన కొడుకులున్నారు... వాళ్ల భ‌విష్యత్తు ముఖ్యం అని... బెజ‌వాడ‌లో నేను... హైద‌రాబాదులో మీరు ... ఇక ఏ క‌క్ష సాధింపులు వ‌ద్ద‌ని... చంద్ర‌బాబు, కేసీఆర్ ఒక అంగీకారానికి వ‌చ్చార‌ని అప్ప‌ట్లో రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రిగింది. ఇపుడు అదే సీన్ రెండు రాష్ట్రాల్లో క‌నిపిస్తోంది. ఏపీ మంత్రివర్గంలోకి నారా లోకేష్ రాబోతున్నారు. కేటీఆర్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో నిర్వహిస్తోన్న శాఖల్ని ఏపీలో లోకేష్ తీసుకోవడానికి ఇంట్రస్ట్‌గా ఉన్నారట. అదే జరిగితే, ఐటీ, పట్టణ, పరిశ్రమలశాఖ మంత్రిగా లోకేష్‌ను త్వరలోనే చూడబోతున్నాం. 
 
ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తొలుత కార్యకర్తల సమన్వయకర్తల నిధికి కన్వీనర్‌గా పార్టీలోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో నిధుల్ని భారీగా సమీకరించారు. పార్టీ విజయం వెనుక లోకేష్ పాత్ర ఉందని స్వయంగా చంద్రబాబు పలు వేదికల మీద చెప్పారు. ఎప్పటికప్పుడు సర్వేలు చేయించారు. లోటుపాట్లను సరిచేయడంతో పాటు యూత్‌ను పార్టీ వైపు మళ్లించడానికి లోకేష్ చేసిన ప్రయత్నం మరువలేనిదని బాబు అభిప్రాయం. 
 
తొలుత 2009 ఎన్నికలకు ముందు తెరవెనుక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు లోకేష్. ఆ ఎన్నికల్లో నగదు బదిలీ పథకాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. వినూత్నమైన పథకం ఐడియా లోకేష్ మెదడు నుంచి పుట్టిందని బాబు బాహాటంగా వెల్లడించారు. పార్టీలోని బాబు కోటరీ కూడా అదే చెప్పారు. తీరా, ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత పథకం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. పార్టీలోని అంతర్గత వర్గాలు కూడా లోకేష్ నాయత్వాన్ని తొలుత అంగీకరించలేదు. దీంతో చంద్రబాబు పక్కా స్కెచ్ వేస్తూ కార్యకర్తల సమన్వయ నిధి కన్వీనర్‌గా నియమించారు. ద్వితీయ శ్రేణి క్యాడర్‌కు క్రమంగా దగ్గర చేర్చారు. 
 
అనుకూలమైన క్యాడర్‌తో లోకేష్ నాయకత్వ పటిమను అడపాదడపా చర్చలోకి తీసుకెళ్లారు. ఆ తరువాత 2014 ఎన్నికలకు ముందు బాబు కోటరీలోని సీనియర్ లీడర్లకు చినబాబును దగ్గరకు చేర్చారు. ఆ సమయంలో చేసిన సర్వేలు, వాటి మీద రివ్యూల్లో కీలకంగా మార్చారు. లోకేష్ ఇచ్చిన రివ్యూలు చాలా బాగున్నాయని బాబు కోటరీ పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించాయి. టిక్కెట్ల కేటాయింపు సమయంలో ఫోన్ల ద్వారా సర్వేను చేయించే బాధ్యత కూడా లోకేష్ తీసుకున్నారు. అక్కడ నుంచి లోకేష్ చరిష్మా పార్టీ అంతటా విస్తరించింది.
 
అధికారంలోకి వచ్చిన తరువాత తొలి రోజుల్లోనే లోకేష్‌కు మంత్రి పదవిని ఇవ్వాలని కొందరు మీడియా ముఖంగా వెల్లడించారు. మరికొందరు కాబోయే ఏపీ సీఎం అభ్యర్థిగా అభివర్ణించారు. అలా రెండున్నరేళ్లు గడిచిన తరువాత మారిన రాజకీయ పరిణామాలు, భవిష్యత్ ఈక్వేన్స్‌ను బేరీజు వేసుకుని లోకేష్ బాబుకు ఈసారి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. తొలుత ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీ పంపించాలని పార్టీలోని సీనియర్లతో పాటు చంద్రబాబు కూడా భావించారట. 
 
కానీ, లోకేష్ అండ్ టీం ఢిల్లీకి వెళ్లడానికి పెద్దగా ఇష్టపడలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో టీడీపీ అవసరంలేని ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. పైగా లోకేష్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే సుజనాచౌదరి అన్ని పనుల్ని అక్కడ చక్కపెడుతున్నారు. ఆ క్రమంలో ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం లేదని లోకేష్ టీం అంచనాకు వచ్చిందట. ఫలితంగా రాష్ట్ర మంత్రివర్గంలోకి లోకేష్‌ను తీసుకోవాలని పార్టీ తుది నిర్ణయానికి వచ్చిందని తెలిసింది.