శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (14:07 IST)

నిఘాలో బయటపడ్డ మన్నార్గుడి మాఫియా ముఠా గుట్టు .. అందుకే శశికళను మోడీ నమ్మడం లేదట!

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ నేతలెవ్వరూ నమ్మడం లేదు. అందుకే ఆమె ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీనికి బలమైన కారణం

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ నేతలెవ్వరూ నమ్మడం లేదు. అందుకే ఆమె ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీనికి బలమైన కారణం లేకపోలేదు. నిజానికి శశికళ వైఖరి పట్ల ప్రధాని మోడీకి ఏమాత్రం సదభిప్రాయం లేదు. ఈ కారణంగానే ఆమె ముఖ్యమంత్రి కావడం ఏమాత్రం ఇష్టంలేదు. 
 
ఎవరిని సీఎంగా ఎన్నుకోవాలన్నది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమైనా.. గతంలో తనకు తెలిసిన కొన్ని సంఘటనల దృష్ట్యా 'మన్నార్‌గుడి మాఫియా' పట్ల ప్రధానికి ఎంతమాత్రం సదుద్దేశం లేదని తెలుస్తోంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు.. శశికళ బృందం వైఖరి గురించి జయలలితను హెచ్చరించారు. ఫలితంగానే 2011లో మన్నార్గుడి మాఫియా (శశికళతో సహా పరివారం)ను పోయెస్ గార్డెన్‌ నుంచి వెళ్లగొట్టారు. దీనిపై 2012లో ‘తెహల్కా’ ఒక కథనాన్ని ప్రచురించింది. 
 
ఆ కథనం ప్రకారం గుజరాత్‌కు చెందిన ఒక ఎన్నారై తమిళనాడులో పెద్ద పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నించారు. తమిళనాట పరిశ్రమ పెట్టాలంటే తమకు ప్రాజెక్టు వ్యయంలో 15 శాతం ముట్టజెప్పాలని మన్నార్గుడి మాఫియా డిమాండ్‌ చేసింది. దీంతో ఆయన గుజరాత్‌కు వెళ్లి అక్కడే పరిశ్రమ పెట్టుకొన్నారు. మాటల సందర్భంలో నాటి గుజరాత్ సీఎం మోడీకి ఈ విషయాన్ని చెప్పారు. దీంతో మోడీ నేరుగా జయలలితకు ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పారు. శశికళ ముఠాతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ తర్వాత అప్రమత్తమైన వారిపై నిఘా పెట్టారు. 
 
సరిగ్గా ఆ సమయంలోనే చెన్నై మోనో రైలు ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న జయ దాన్ని సింగపూర్‌కు చెందిన ఒక పెద్ద కంపెనీకి అప్పగించాలని భావించారు. ఈ విషయాన్నినాటి తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిచి.. ఫైల్‌ తయారు చేయాలని కోరారు. కానీ ఆమె ఆదేశాలకు విరుద్ధంగా మరో కంపెనీకి ఆ ప్రాజెక్టు అప్పగించాలన్న ప్రతిపాదనతో ఫైల్‌ తయారైంది. దీన్ని చూసిన జయలలిత ఆశ్చర్యపోయి.. సీఎస్‌ను ప్రశ్నించగా అసలు విషయం వెల్లడైంది. 'మీరు పంపిన నోట్‌ ఆధారంగానే ఫైల్‌ తయారు చేశామ'ని చెప్పి, ఆమె సంతకంతో ఉన్న నోట్‌ను చూపారు. అసలు ఆ నోట్‌పై ఉన్న సంతకం తనదికాదని, ఫోర్జరీ అని గుర్తించిన జయ దానిపై ఆరా తీయడంతో మన్నార్గుడి మాఫియా ప్రమేయం బయటపడింది.
 
ఆ తర్వాత శశికళ తనకు ఇస్తున్న మందులపైనా జయలలితకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోగా.. ఆమెకు ఇచ్చే మందుల్లో మత్తు కలిగించే పదార్థాలు, కొద్దిపాటి మోతాదులో విషం కలిగిన రసాయన అవశేషాలు(స్లోపాయిజన్‌) ఉన్నట్టు తేలింది. మరోవైపు 2012 డిసెంబరు మొదటి వారంలో శశికళ కుటుంబ సభ్యులు పలువురు బెంగళూరులో రహస్యంగా సమావేశమైన సంగతి కూడా జయకు తెలిసింది. అక్కడ వారి సంభాషణను కర్ణాటక ఇంటెలిజెన్స్‌ వర్గాలు రికార్డు చేసి నాటి తమిళనాడు డీజీపీ కె.రామానుజానికి అందించాయి. ఆ ఆడియో టేపులను విన్న జయ తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. అక్రమాస్తుల కేసులో తాను సీఎం పదవిని కోల్పోతే, ఎవరు సీఎం కావాలన్న దానిపై శశికళ, ఇతర కుటుంబ సభ్యుల నడుమ జరిగిన చర్చ ఆ టేపుల్లో ఉంది.
 
అంతేనా... మన్నార్‌‌గుడి మాఫియాపై ప్రైవేటు డిటెక్టివ్‌లతో నిఘా కొనసాగింది. ఈ నిఘాలో.. మన్నార్గుడి మాఫియా చేయించిన తాంత్రిక పూజల గురించి కూడా బయటపడింది. చివరకు డిసెంబరు 17, 2011న శశికళతోసహా మన్నార్‌ గుడి మాఫియాను పోయెస్‌ గార్డెన్‌ వదిలి వెళ్లాలని అమ్మ ఆదేశించారు. 18న శశికళ, ఆమె భర్తసహా పలువురిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ వెంటనే మన్నార్‌‌గుడి మాఫియాపై ఏసీబీ దాడులు ప్రారంభమయ్యాయి. పలువురి ఇళ్ల నుంచి కోట్లాది రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. 
 
అయితే, జరిగిన ఉదంతంలో తన పాత్ర ఏమీ లేదని శశికళ.. జయలలితను వేడుకోగా, శశికళను దగ్గరకు చేరదీశారు. ఇదంతా తెలిసినందునే శశికళ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విముఖంగా ఉన్నట్టు సమాచారం. ఆమెను జయలలిత నమ్మి ఉండొచ్చుగానీ.. ప్రధానికి మాత్రం ఆమెపై నమ్మకం లేదనే విషయాన్ని ప్రధాని కార్యాలయ వర్గాలు అన్నాడీఎంకే ఎంపీలకు స్పష్టంచేశాయి కూడా. అయితే, శశికళ మొండిపట్టుదలతో ముందుకు సాగడం వల్లే తమిళనాట రాజకీయ సంక్షోభం నెలకొనేందుకు కారణంగా నిలిచింది.